Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిగా మారావా పీకే..!

By:  Tupaki Desk   |   11 March 2020 3:30 PM GMT
కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిగా మారావా పీకే..!
X
పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టు అనే హోదా నుంచి ప్యూర్ పొలిటీషియ‌న్ అయిపోతున్నాడు ప్ర‌శాంత్ కిషోర్. కింగ్ మేక‌ర్ దేశ వ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి ఆద‌ర‌ణ పొందుతున్న పీకే.. ఇప్పుడు త‌నే కింగ్ అయ్యే ప్ర‌య‌త్నాల్లో ఉన్నట్టున్నాడు. ఆ మేర‌కు రాజ‌కీయ పార్టీల స‌భ్య‌త్వాన్ని కూడా తీసేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే బిహార్ లో జేడీయూ లో చేరాడీయ‌న‌. అక్క‌డ ఎక్కువ‌గా మాట్లాడారు. అవ‌స‌రానికి మించి ఎక్కువ‌గా మాట్లాడుతుండే స‌రికి పీకేను సాగ‌నంపారు జేడీయూ వాళ్లు. ప్ర‌శాంత్ కిషోర్ ను ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించారు. ఆ త‌ర్వాత ఆయ‌న ప‌శ్చిమ బెంగాల్ లో మ‌మ‌త పార్టీకి చేరువ అయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న టీఎంసీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు కూడా నామినేట్ కాబోతున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రి తృణ‌మూల్ కాంగ్రెస్ స‌భ్యుడిలా అయినా మాట్లాడ‌టం లేదు పీకే. కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధిలా మాట్లాడుతున్నారాయ‌న‌! ప్ర‌స్తుతం కాంగ్రెస్ కు సింధియా రాజీనామా చేయ‌డం గురించి చ‌ర్చ హాట్ హాట్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సింధియా విష‌యంలో కాంగ్రెస్ పార్టీ త‌ప్పు చేసింద‌నే అభిప్రాయాలే స‌ర్వ‌త్రా వినిపిస్తూ ఉన్నాయి. సామ‌ర్థ్య‌మున్న ఒక యువ‌నేత‌ను కాంగ్రెస్ గుర్తించ‌లేక‌ పోయింద‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వినిపిస్తూ ఉన్నాయి. వృద్ధ నేత‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూ యువ నేత‌ల‌ను కాంగ్రెస్ మిస్ చేసుకుంటోంద‌ని అనేక మంది అభిప్రాయ‌ప‌డుతూ ఉన్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీనే రైటు అంటున్నాడు ప్ర‌శాంత్ కిషోర్. అదేమంటే.. జ్యోతిరాదిత్య సింధియా కూడా ఇంటి పేరుతో రాజ‌కీయం చేసిన వార‌నే విష‌యాన్ని పీకే ప్ర‌స్తావిస్తూ ఉన్నారు. చాలా మంది రాహుల్ ను కుటుంబ రాజ‌కీయం అంటూ విమ‌ర్శిస్తూ ఉంటార‌ని, అయితే సింధియా కూడా అదే తీరున రాజ‌కీయంగా ఎదిగారు కదా, కుటుంబ పౌర‌స‌త్వంతోనే ఆయ‌న గుర్తింపు తెచ్చుకున్నాడు అనే అంశాన్ని ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌స్తావించాడు. రాహుల్ ను విమ‌ర్శించే వాళ్లు సింధియాను ఎలా ప్ర‌శంసిస్తార‌ని ఈయ‌న ప్ర‌శ్నించేశాడు. మొత్తానికి ప్ర‌శాంత్ కిషోర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధిలా మాట్లాడేస్తూ ఉన్న‌ట్టున్నాడు!