Begin typing your search above and press return to search.

పీకే మామూలోడు కాదు

By:  Tupaki Desk   |   2 Sep 2021 2:30 AM GMT
పీకే మామూలోడు కాదు
X
రాజకీయ వ్యూహకర్తగా పాపులరైన ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తును వెదుక్కోవాలని అనుకుంటున్నారా ? సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధిల తర్వాత కీలకమైన పదవిని కోరుకుంటున్నారా ? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. సోనియా రాజకీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపి అయిన దివంగత నేత అహ్మద్ పటేల్ పోస్టును కోరుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో సోనియా తర్వాత అహ్మద్ పటేలే అత్యంత కీలకమైన నేత.

కొన్నిసార్లు సోనియా కన్నా పటేలే కీలకమనిపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పోస్టు అహ్మద్ కు ఆషామాషీగా ఏమీ రాలేదు. దశాబ్దాలపాటు పార్టీలో పనిచేసి డక్కామొక్కీలు తిన్న తర్వాతే అందుకున్నారు. అలాంటి పోస్టులో పీకే కూర్చోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అహ్మద్ చనిపోయిన దగ్గర నుండి సదరు పోస్టు ఖాళీగానే ఉండిపోయింది. కాబట్టి తనకు ఆ పోస్టు కావాలని పీకే పట్టుబట్టారట.

ఈమధ్య సోనియాతో పాటు రాహుల్, ప్రియాంకలతో పీకే వరుసగా భేటీలైన విషయం అందరికీ తెలిసిందే. నరేంద్రమోడిని ఓడించటమే టార్గెట్ గా పీకే పదవులు కదుపుతున్నారు. ఇదే సమయంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్లో సక్సెస్ కాగానే పీకేకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. బెంగాల్ రిజల్టు రాగానే మమతాబెనర్జీకీ పీకే అత్యంత ఇష్టుడిగా మారోయారు. ఈ కారణంగానే మోడికి వ్యతిరేకంగా మమత కదుపుతున్న రాజకీయంలో శరద్ పవార్ తో కూడా పీకే భేటీ అయ్యారు. ఆ తర్వాతే సోనియా అండ్ కో తో కూడా సమావేశమయ్యారు.

మోడికి వ్యతిరేకంగా కలవాలన్న ప్రతిపక్షాల్లో సోనియా, మమత, పవార్, ఆర్జేడీ తదితర పార్టీలకు బాగా సన్నిహితుడు కావటంతోనే పీకేకి డిమాండ్ పెరిగిపోయింది. కాబట్టి పెరిగిన డిమాండ్ ను అడ్వాంటేజ్ తీసుకోవాలని పీకే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకనే కాంగ్రెస్ లో అత్యంత కీలకమైన పోస్టును కోరుకుంటున్నారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.