Begin typing your search above and press return to search.

తండ్రి లాంటోడంటూనే తిట్టిపోసిన పీకే

By:  Tupaki Desk   |   19 Feb 2020 1:00 AM IST
తండ్రి లాంటోడంటూనే తిట్టిపోసిన పీకే
X
చెప్పే మాటలకు.. చేసే పనులకు సంబంధం ఉందన్నట్లుగానే ఉంది ఎన్నికల వ్యూహకర్త పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ తీరు చూస్తుంటే. తాజాగా మీడియా తో మాట్లాడిన ఆయన.. ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన తండ్రి లాంటోడని.. తనను కొడుకు మాదిరి చూసుకుంటాడని ఆయన తరచూ చెబుతుంటారు. ఓ వైపు అలా చెబుతూనే.. మరోవైపు బిహార్ వెనుకబాటుతనాన్ని ప్రశ్నిస్తుంటారు.

తాను మరే పార్టీ చేరనని స్పష్టం చేస్తున్న ఆయన.. తాను కోరకుండానే తనను పార్టీలోకి తీసుకున్నారని.. ఆయనే తనను పార్టీ నుంచి బహిష్కరించారన్నారు. అయినప్పటికీ నితీశ్ మీద తనకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ఆయన తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా తాను గౌరవిస్తానని చెబుతూనే.. తన జీవితం బిహార్ కే అంకితమన్నారు. రాష్ట్ర డెవలప్ మెంట్ కోసం బాత్ బిహార్ కీ అనే పేరు తో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లుగా వెల్లడించారు.

సైద్ధాంతికంగా నితీశ్ అనుసరిస్తున్న విధానాల్ని తప్పు పట్టారు. పార్టీ సిద్ధాంతాల మీద తనకు.. నితీశ్ కు మధ్య చాలానే చర్చ జరిగిందన్న పీకే.. గాంధీజీ సిద్ధాంతాలు.. ఆదర్శాలను పార్టీ ఎప్పటికి వీడబోదని తనకెప్పుడూ చెబుతుండేవారన్నారు. కానీ.. గాంధీ హంతకుడైన గాడ్సే కు అనుకూలంగా ఉన్న వ్యక్తులతో పార్టీ పని చేస్తుందన్నారు.

తన వరకైతే.. గాంధీ.. గాడ్సే కలిసిమెలిసి ఉండరన్న విషయాన్ని స్పష్టం చేశారు. బిహార్ ముఖ్యమంత్రి తన తండ్రి లాంటివాడని చెప్పే పీకే.. నితీశ్ ఏలుబడి లో ఉండే బిహార్ రాష్ట్ర డెవలప్ మెంట్ గురించి ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. బిహార్ ఇప్పటికి ఇంకా వెనుకబడే ఉందన్న ఆయన.. బిహార్ మాత్రమే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉంది? అని ప్రశ్నించారు.

ఈసారి ఎన్నికల్లో గెలిస్తే బిహార్ డెవలప్ మెంట్ కోసం ఏం చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్న పీకే.. దేశంలోని ఉత్తమ పది రాష్ట్రాల్లో బిహార్ ను ఒకటిగా చేయటమే తన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే బాత్ బిహార్ కీ.. ప్రోగ్రాంను అందుకే షురూ చేశానన్నారు. ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని.. వంద రోజుల్లో కోటి మంది యువతను కలవటమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు. చూస్తుంటే.. పీకే లెక్క తేడాగా ఉండటమే కాదు.. ఆయన ఆలోచనలు రోటీన్ కు కాస్త భిన్నంగా ఉన్నాయనిపించట్లేదు? అయినా తండ్రి లాంటోడంటూనే ఇలా తిట్ల వర్షం కురిపించటం ఎందుకంటారు?