Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై బ్రహ్మాస్త్రం

By:  Tupaki Desk   |   17 April 2016 10:50 AM GMT
కేసీఆర్ పై బ్రహ్మాస్త్రం
X
తెలంగాణలో కాంగ్రెస్ ను బతికించడానికి ఆ పార్టీ పెద్ద కసరత్తే చేస్తోంది. ఇందుకుగాను ప్రజా నాడి పట్టడంలో నిపుణుడయిన ప్రశాంత్ కిశోర్ ను రంగంలోకి దించింది. ఆయన తెలంగాణలో ఎంటరై ఇప్పటికే పని ప్రారంభించారు. ప్రశాంత్ కిశోర్ మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు మోడీ టీంలో ఉండేవారు. అమిత్ షా ఎన్నికల వ్యూహాల్లో ప్రశాంత్ కిశోర్ దే కీలక పాత్ర. అలాంటి ప్రశాంత్ కిశోర్ కు ఆ తరువాత అమిత్ షాతో పొసగలేదు. దీంతో ఆయన టాలెంటు తెలిసిన నితీశ్ కుమార్ తన కోసం ఉపయోగించుకున్నారు. ప్రశాంత్ ప్లానింగుతో బీహార్లో బీజేపీని ఓడించి నితీశ్ గెలిచారు. ఆ తరువాత ప్రశాంత్ సత్తా తెలుసుకుని ఆయన్ను కాంగ్రెస్ ఇప్పుడు ఉపయోగించుకుంటోంది. ఎన్నికలేమీ లేనప్పటికీ పార్టీని బతికించడం కోసం ఆయన్ను తెలంగాణకు పంపించింది.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ తాము అధికారంలోకి రాలేదన్న బాధ కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి వేధిస్తోంది. దీనికితోడు టీఆరెస్ లోకి తమ పార్టీ ఎమ్మెల్యేలు కుడా బారులు తీరుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలోపాలు పోవడం లేదు. పొన్నాల నేతృత్వంలో పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిందని వెంటనే ఆయన్ను మార్చాలని మిగిలిన నాయకులు కోరడంతో అధిష్టానం ఆయన్ను తప్పించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కు పగ్గాలు అప్పజెప్పింది. ఉత్తమ్ అందరినీ కలుపుకుని పోలేకపోతున్నారు. వరంగల్ పార్లమెంట్ స్ధానం - గ్రేటర్ ఎన్నికల్లో పార్టిని గెలుపు తీరాలకు చెర్చాడంలో విఫలమయ్యారు. కనీసం, తమ పార్టీ ఎమ్మెల్యే - పీఏసీ చైర్మన్ గా ఉన్నా కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నారాయణఖేడ్ అసెంబ్లీ స్ధానాన్ని సైతం కాపాడుకోలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు ఉత్తమ్. దీంతో అధిష్టానం తానే స్వయంగా రంగంలోకి దిగింది. కారు పార్టీపై విమర్శలు పెంచాలని ఆదేశాలిచ్చినా. వాటినిఅమలు చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారు. దీనికితోడు తాజాగా మక్తల్ ఎమ్మెల్యే కూడా కారెక్కడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో రాజకీయాల్లో వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం తెలంగాణలో అడుగుపెట్టారు. తెలంగాణలో పార్టీ బలపడేందుకు అన్ని రకాల అవకాశాలున్నా.. రాజకీయ నాయకుల సమన్వయలోపం పార్టీలో బీసీ - ఓసీ లు నిలువునా చీలిపోవడంతో నాయకుల మధ్య ఐక్యత లోపించింది. ఈ నేపధ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రశాంత్ తెలంగాణ రాజకీయాలపై అధ్యయనం ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 30 మంది మెరికల్లాంటి యువ నాయకులకు తన ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించాలన్న యోచనలో ఉన్నారు. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 3,600 మంది యువనాయకులు కావాలని కోరుతున్నారు. అధిష్టానం కూడా ప్రశాంత్ అడిగిన వారి జాబితా సిద్ధం చేయాలని ఉత్తమ్ కు సూచించింది. తెలంగాణలో ఉన్నా మౌలిక సమస్యలపై పోరాటం జరిపేందుకు వీరికి శిక్షణ ఇస్తారని సమాచారం. ప్రశాంత్ రాజకీయం ఏమేరకు పనిచేస్తుందోనని పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరి ఈ ఆటలో ప్రశాంత్ గెలుస్తారో లేదంటే కేసీఆరే గెలుస్తారో చూడాలి.