Begin typing your search above and press return to search.

మరోసారి బయటపడ్డ ప్రశాంత్ కిషోర్ జాదూతనం

By:  Tupaki Desk   |   27 Jun 2016 9:34 AM GMT
మరోసారి బయటపడ్డ ప్రశాంత్ కిషోర్ జాదూతనం
X
చెప్పినట్లే జరుగుతోంది. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే తన లక్ష్యమని భాద్యత తీసుకున్న పోల్ మ్యాన్ ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో యూపీ కాంగ్రెస్ పార్టీని తరచూ వార్తల్లో ఉండేలా చేస్తున్న సంగతి తెలిసిందే. కనిష్ఠంగా వారం.. గరిష్ఠంగా రెండు వారాల వ్యవధిలో ఏదో ఒక అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వార్త ఒకటి జాతీయ స్థాయిలో వచ్చేలా చేయటం ఆయనకు అలవాటు. దీనికి తగ్గట్లే కొద్దినెలల్లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఫలానా అంటూ తరచూ ఏదో ఒక పేరును తెర మీదకు తీసుకురావటం.. ఆ తర్వాత దానికి కౌంటర్ గా మరో వాదన వినిపించటం లాంటివి ఆయన చేస్తున్నారు.

లాజిక్ ఏమీ లేకున్నా.. పలు పేర్లు యూపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటకు వచ్చేలా చేయటం.. దాని మీద కొంత చర్చ జరగటం.. ఆ తర్వాత కొద్ది రోజుల మౌనం తర్వాత.. మళ్లీ అలాంటిదేమీ లేదన్నట్లుగా వార్తలు వచ్చేయటం.. మళ్లీ కొద్ది రోజులకే మరోపేరు పార్టీ పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలు రావటం మామూలే. ఇదంతా ఒక వ్యూహం మాదిరి సాగిపోతోంది. ఈ మధ్యనే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేరును యూపీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై జాతీయ మీడియా సైతం ప్రాధాన్యత ఇచ్చింది.

నిజానికి ఏ లాజిక్ ప్రకారం చూసినా యూపీ ఎన్నికల్లో షీలాదీక్షిత్ సూట్ కారు. కానీ.. ఇలాంటి ప్రశ్నలు వేసుకోకుండానే ఆ వార్తల్ని పత్రికలు అచ్చేస్తే.. టీవీ ఛానళ్లు పోటాపోటీగా ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా వార్తలు ఇచ్చేశారు. ఇది జరిగి వారం.. పది రోజులు పూర్తి అయిన వెంటనే షీలా విషయంలో వెనక్కి తగ్గినట్లుగా వార్తలు మళ్లీ వచ్చేశాయి. యూపీకి పార్టీ సీఎం అభ్యర్థిగా తాను సిద్ధంగా లేనట్లుగా ఆమె పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. పైకి చూస్తే.. ఇదంతా ఒక పరిణామంగా జరిగినట్లు కనిపించినా.. లోగుట్టు చూస్తే.. ఇక్కడే పోల్ మ్యాన్ ప్రశాంత్ కిషోర్ జాదూతనం ఇట్టే అర్థమైపోతుంది. తనకు నచ్చినట్లుగా మీడియాలో వార్తలు వచ్చేలా చేసుకోవటంలో ఆయనకు ఆయనే సాటి అన్న అభిప్రాయం.. షీలా ఎపిసోడ్ లో స్పష్టంగా కనిపించిందని చెప్పొచ్చు.