Begin typing your search above and press return to search.

అమ్మాకొడుకుల్ని కన్వీన్స్ చేసే మొనగాడు

By:  Tupaki Desk   |   15 July 2016 7:24 AM GMT
అమ్మాకొడుకుల్ని కన్వీన్స్ చేసే మొనగాడు
X
ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏ విషయానికైనా.. ఎంతటి నాయకుడైనా తన అభిప్రాయం చెప్పాలే కానీ.. తుది నిర్ణయాన్ని నిర్దేశించే సీన్ గాంధీ ఫ్యామిలీ ఇవ్వదు. కోట్లాదిమంది మనసుల్ని గెలుచుకున్న కొమ్ములు తిరిగిన నాయకుడి మాట సైతం ఎంతవరకు ఉండాలన్న విషయాన్ని తమ చేతలతో చెప్పేసే గాంధీ ఫ్యామిలీ తొలిసారి ఒక వ్యక్తి మీద విపరీతంగా ఆధారపడటమే కాదు.. అతడేం చెబితే దాన్ని కిమ్మనకుండా ఫాలో అవుతున్న పరిస్థితి.

యూపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును ప్రకటించటం.. యూపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్ని మైనార్టీకి చెంది గులాం నబీ అజాద్ కు అప్పగించటం.. యూపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాల్ని ఓబీసీ అయినా రాజ్ బబ్బర్ చేతికి అప్పచెబుతున్న తీరు చూస్తుంటే.. ఎన్నికల రాజకీయ నిపుణుడు ప్రశాంత్ కిశోర్ హవా ఏ రేంజ్లో సాగుతుందో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.

2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని పీఠం మీద కూర్చేందుకు వీలుగా మోడీకి రాజకీయ వ్యూహాల్ని సిద్దం చేసి.. విజయవంతంగా అమలు చేసిన ప్రశాంత్ ను తాజాగా తమ ఎన్నికల వ్యూహ నిపుణుడిగా కాంగ్రెస్ ఎంపిక చేసుకోవటం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు.. బీహార్ ఎన్నికల సమయంలో ప్రశాంత్ వ్యూహాలు ఎలా వర్క్ వుట్ అయ్యాయో ప్రత్యక్షంగా చూసిన కాంగ్రెస్ యువరాజు చొరవతో ప్రశాంత్ కాంగ్రెస్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. యువరాజు అడిగిన వెంటనే బాధ్యతలు తీసుకోని ప్రశాంత్.. తాను చెప్పినట్లే అన్ని విషయాల్లో నిర్ణయాలు ఉండాలని.. టిక్కెట్ల జారీ మొదలు.. ప్రచార వ్యూహం వరకూ అన్ని తాను చెప్పినట్లుగా చేస్తానని మాట ఇస్తానంటేనే కాంగ్రెస్ కు పని చేస్తానని స్పష్టం చేయటం.. అందుకు యువరాజు ఓకే అనటంతో ప్రశాంత్ గత కొద్ది నెలలుగా యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవకాశాలపై విస్తృతంగా సర్వేలు నిర్వహించారు.

అనంతరం ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగమే యూపీ పార్టీ చీఫ్ గా రాజ్ బబ్బర్.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ నియామకం అని చెబుతున్నారు. కుల సమీకరణలు అన్ని చూసుకున్నాకే తానీ నిర్ణయం తీసుకున్నానని చెప్పిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తాజా నిర్ణయాలుగా చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పూర్తిస్థాయిలో ప్రశాంత్ కిశోర్ మీద ఆధార పడిన కాంగ్రెస్ ను ఆయన ఏ దరికి చేరుస్తారో చూడాలి.