Begin typing your search above and press return to search.

మొదటిసారి మిస్‌ అయినా ఎన్నిసార్లు కలిశారో?

By:  Tupaki Desk   |   1 July 2015 11:25 AM GMT
మొదటిసారి మిస్‌ అయినా ఎన్నిసార్లు కలిశారో?
X
వర్షాకాలం విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని.. హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకటానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రోటోకాల్‌ అడ్డురావటం తెలిసిందే. చట్టంలోని నిబంధనల నేపథ్యంలో హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లలేని ఆయన.. తర్వాత తనకు వచ్చిన ఏ అవకాశాన్ని విడిచి పెట్టకుండా రాష్ట్రపతి ప్రణబ్‌ మనసును దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ఆయన్ని కలవని చంద్రబాబు.. మంగళవారం ఉదయం ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవటం తెలిసిందే. నిన్న రాత్రి రాజ్‌భవన్‌లో.. గవర్నర్‌ ఏర్పాటు చేసిన విందుకు హాజరైన చంద్రబాబు.. రాష్ట్రపతి ప్రణబ్‌ పక్కనే కూర్చున్నారు.

బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రణబ్‌ను రేణిగుంట విమానాశ్రయంలో సాదరంగా స్వాగతం పలికిన చంద్రబాబు.. ఆయన వెంట తిరుచానూరు అమ్మవారిని సందర్శించుకున్నారు. అనంతరం.. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం చేయించనున్నారు. హైదరాబాద్‌ వచ్చిన మొదటి రోజు స్వాగతం పలికే అవకాశం మిస్‌ అయినప్పటికీ.. తర్వాత తనకున్న ప్రతి అవకాశాన్ని మిస్‌కాకుండా చంద్రబాబు వినియోగించుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది. ఎంతైనా చంద్రబాబు కదా.. ఏ అవకాశాన్ని ఆయన వదులుకోరు కదా.