Begin typing your search above and press return to search.

మన సెనేటర్లు మాటలకే పరిమితమా?

By:  Tupaki Desk   |   25 Feb 2017 1:32 PM IST
మన సెనేటర్లు మాటలకే పరిమితమా?
X
అగ్రరాజ్యం అమెరికాలో విద్వేష తూటాలకు బలయిని తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్‌ కుచిభోట్ల మరణంపై అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన ప్రజాప్రతినిధుల నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదు. ఘటనను ఖండించడం తప్ప వారు పెద్దగా చేసిందేమీ లేదు. శ్రీనివాస్‌ కుచిభోట్ల హత్యను అక్కడి మన సెనేటర్లు తీవ్రంగా ఖండించినప్పటికీ భారతీయులకు మరణశాసనంగా మారుతున్న అమెరికన్ల జాత్యహంకార దాడులను అడ్డుకోవడానికి ఏం చేస్తామనేది మాత్రం చెప్పడం లేదు.

మొన్నటి ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి సెనేటర్ గా ఎన్నికైన కమల్ హారిస్ శ్రీనివాస్ హత్యపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబానికి సానుభూతి తెలిపిన ఆమె విద్వేషం విజయం సాధించకుండా చూడాల్సిన అవసరముందని ట్విట్టర్ లో రాశారు. అయితే... దీనిపై అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానని కానీ.. చట్టపరంగా చర్యలు వేగవంతమయ్యేలా సహకరిస్తానని కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు.

మరోవైపు అక్కడి కాంగ్రెస్ ఉమన్ పరిమళ జయపాల్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కాన్సాస్‌ కాల్పులతో ఛిన్నాభిన్నమైన శ్రీనివాస్ కుటుంబం గురించి బాధగా ఉందని ఆమె తన సానుభూతి తెలిపారు. మతిలేని హింసకు మన దేశంలో తావులేదన్నారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయురాలు ఆమె.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన నాటి నుంచి దేశంలో విద్వేష నేరాలు పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాన్సాస్‌ నగరంలో జరిగిన కాల్పులను ఇండియన్‌ అమెరికన్‌ చట్టసభ సభ్యుడు రో ఖన్నా కూడా ఖండించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/