Begin typing your search above and press return to search.

రాహుల్ టూర్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్ దుమారం..

By:  Tupaki Desk   |   8 May 2022 6:08 AM GMT
రాహుల్ టూర్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్ దుమారం..
X
అనుకున్న దానికంటే ఎక్కువగా సక్సెస్ అయ్యింది రాహుల్ గాంధీ తెలంగాణ టూర్. రెండు రోజులపాటు ఉండి.. భారీ బహిరంగ సభతో పాటు.. పార్టీ నేతలతో భేటీలు.. వివిధ వర్గాల్ని కలుసుకోవటం.. వారి నుంచి సలహాలు.. సూచనలు స్వీకరించటం లాంటి వాటితో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. అదే సమయంలో.. అధికార టీఆర్ఎస్ రగిలిపోతోంది. కాంగ్రెస్ మీద కస్సు మంటున్న గులాబీ వర్గానికి దన్నుగా నిలిచారు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటున్న ఆయన.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ రెండు రోజుల తెలంగాణ పర్యటన మీద ఘాటు విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ వర్గాలు కస్సుముంటున్నాయి.

రెండు రోజులు రాహుల్ తెలంగాణ పర్యటనపై ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఇది తీవ్ర దుమరాన్ని రేపుతోంది. ‘‘తెలంగాణను దార్శనికుడైన కేసీఆర్ పరిపాలిస్తున్నారు. మీ మూర్ఖుల గుంపుతో ఏం ఆఫర్ చేస్తారో చెప్పాలి’’ అంటూ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ వర్గాలు విరుచుకుపడుతున్నాయి. ప్రకాశ్ రాజ్ కు సినిమాలు లేవని.. గ్లామర్ ఔటైందన్న కామెంట్లు కొందరు చేస్తుంటే.. ఒక్క రోజు ప్రజల్లోకి రాని ప్రకాశ్ రాజ్ కు ఏం తెలుసని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.

రాహుల్ కాలి గోటికి కూడా ప్రకాశ్ రాజ్ సరిపోడని జగ్గారెడ్డి ఫైర్ అయితే.. ‘‘ఆయనో బఫూర్.. అంత మొనగాడు అయితే మొన్న జరిగిన ‘మా’ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయినట్లు?’’ అని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చే రాజ్యసభ సీటు కోసం ఆయన నోటి నుంచి ఈ మాటలు వస్తున్నాయని చెబుతున్నారు. రాహుల్ పర్యటనపై సానుకూలత వ్యక్తమవుతున్న వేళ.. అందుకు భిన్నంగా ప్రకాశ్ రాజ్ విరుచుకుపడిన వైనం ఇప్పుడు కొత్త వేడిని పుట్టిస్తోంది. తన పాలనను ఇంతలా వెనకేసుకు వచ్చిన ప్రకాశ్ రాజ్ రుణాన్ని కేసీఆర్ ఉంచేసుకుంటారా? వడ్డీతో సహా చెల్లించేస్తారా? అన్నది త్వరలోనే తేలుతుందన్న మాట వినిపిస్తోంది.