Begin typing your search above and press return to search.

న్యాయం భూస్థాపితం అయింది..బాబ్రీ తుదితీర్పు పై ప్రకాష్ రాజ్!

By:  Tupaki Desk   |   30 Sep 2020 5:30 PM GMT
న్యాయం భూస్థాపితం అయింది..బాబ్రీ తుదితీర్పు పై ప్రకాష్ రాజ్!
X
దేశమంతా ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురుచూసిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన ముందుస్తు పథకం ప్రకారం జరిగింది కాదని, పథకం ప్రకారం కూల్చివేసినట్టుగా ఆధారాలు లేవని వెల్లడించింది. లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానంలోని కోర్టు రూమ్‌ నంబరు 18లో సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్‌ యాదవ్‌ తుది తీర్పును చదివి వినిపించారు. ఈ కేసులో మొత్తం 2000 పేజీల తీర్పును వెలువరించారు. కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని తేల్చారు. కూల్చివేత పథకం ప్రకారం జరిగిందనేందుకు ఆధారాలు లేవని జడ్జి స్పష్టం చేశారు. కూల్చివేతకు ఎవరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యలేదనీ, కుట్రపూరితంగా వ్యవహరించలేదని తీర్పులో వెల్లడించింది.

1992 డిసెంబర్ 6వ తేదీన కర సేవకులు మసీదు ఉన్న స్థలాన్ని కూల్చివేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై లబిర్హన్ కమిషన్ వేయగా.. అద్వానీ, జోషి నేరపూరిత కుట్ర ఉందని నివేదించింది. తర్వాత సీబీఐ విచారణ చేపట్టి అభియోగాలు మోపింది. సీబీఐ కోర్టు, అలహాబాద్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో 30వ తేదీన లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పును వెల్లడించింది. 48 మంది నిందితుల్లో 16 మంది చనిపోగా... ఆరోపణలు ఎదుర్కొన్న, బతికివున్న 32 మంది కోర్టుకు హాజరు కావాలని కోరగా... ఐదుగురు మాత్రమే కోర్టు రూం నెంబర్ 18లో ఉన్నారు. మిగతావారు బయట లాబీలో ఉన్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితోపాటు కరోనాతో బాధపడుతున్న ఉమాభారతి కోర్టుకు హాజరుకాలేదు.

బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు మీద నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. దీన్ని హిట్ అండ్ రన్ కేసుగా అభివర్ణించారు. ‘హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లను నిర్దోషులుగా తేల్చారు. అద్వానీ, జోషి తదితరులు రెచ్చగొట్టే ప్రసంగాలతో కర సేవకులు రెచ్చిపోయారని చెబుతుంటారు. కానీ ఇవాళ న్యాయం భూస్థాపితం అయ్యిందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఇదీ నయా భారత్.. సరికొత్తగా ఆవిష్కృతం చెందుతుందని తెలిపారు.