Begin typing your search above and press return to search.

ఇంజినీరింగ్‌ లో వేదాలు-పురాణాలు చద‌వాల్సిందే

By:  Tupaki Desk   |   26 Jan 2018 7:44 AM GMT
ఇంజినీరింగ్‌ లో వేదాలు-పురాణాలు చద‌వాల్సిందే
X
ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఇక నుంచి మూలాల్లోకి వెళ్లాల్సిందే. ఎందుకంటే..ఇకపై సాంకేతిక పరిజ్ఞానం - బిగ్‌ డేటా - బుల్లెట్‌ రైళ్లపైనే కాదు - వేదాలు - పురాణాలు - తర్కశాస్త్రం - యోగా శాస్త్రాలను కూడా అధ్యయనం చేయాలి. ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) ఈ మేరకు కొత్త పాఠ్యాంశ ప్రణాళికను విడుదల చేసింది. ఇంజినీరింగ్‌ విద్యార్థులు తప్పనిసరి కోర్సుల్లో భాగంగా రాజ్యాంగం - పర్యావరణ సైన్సుకు సంబంధించిన విషయాలపై ఇప్పటివరకూ అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాటి మార్కులను పరిగణలోకి తీసుకోరు.

భారతీయ తాత్విక - భాషా - కళాత్మక సంప్రదాయాలు - యోగాతోపాటు ఆధునిక శాస్త్రీయ దృక్పథంపై అవగాహన పెంపొందించేందుకు పాఠ్యప్రణాళికను పునరుద్ధరించినట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు. ఆలోచన విధానం - తర్కం వేదాల్లోని ప్రాథమిక సూత్రాలను విద్యార్థులకు అందచేయడమే అ పాఠ్యాంశాలను పొందుపరిచే లక్ష్యమన్నారు. దేశంలో ఇంజనీర్ల నాణ్యతపై తరచుగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో అధిక భాగం నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారనీ, వారి సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టాలని ఒకపక్క వాదనలు వినిపిస్తుంటే.. మరోపక్క వారికి వేద పురాణాల్లో జ్ఞానాన్ని పెంచుతామంటూ కొత్త సిలబస్‌ ను రూపొందించడం గ‌మ‌నార్హం.

దేశంలోని దాదాపు మూడు వేల కళాశాలల నుంచి ప్రతి ఏటా సుమారు 7 లక్షల మంది ఇంజినీర్లు బయటకు వస్తున్నారు. కానీ, వారిలో సగం మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. 2015-16లో 7,58,000 గ్రాడ్యుయేట్లు బయటకురాగా - అందులో 3,34,000 మందికి మాత్రమే క్యాంపస్‌ నియామకాల్లో ఉద్యోగాలు పొందారు. నాణ్యతా విద్యపై దృష్టిసారించాల్సిన ప్రభుత్వం వేదాలు బోధిస్తాన‌నడం ఎంత వరకు సమంజసమని వామ‌ప‌క్షాల విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.