Begin typing your search above and press return to search.

ప్ర‌కాశం ఎమ్మెల్యే రూ.58 కోట్ల ప‌నులు.. లాభం రూ.30 కోట్ల పైనే!?

By:  Tupaki Desk   |   30 March 2022 3:30 PM GMT
ప్ర‌కాశం ఎమ్మెల్యే రూ.58 కోట్ల ప‌నులు.. లాభం రూ.30 కోట్ల పైనే!?
X
దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న‌ట్లు అధికారంలో ఉండ‌గానే దండుకోవ‌డం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటే. పైకి మాత్రం తాము ఎలాంటి అన్యాయం చేయ‌డం లేదు. త‌మ బాధ్య‌త‌ల‌ను న్యాయంగా నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నామంటూ డ‌ప్పు కొట్టుకుంటారు. కానీ అసలు విష‌యం వెలుగులోకి వ‌స్తే అప్పుడు బండారం బ‌య‌ట‌ప‌డుతుంది.

ఇప్పుడు ఏపీలోని ఓ వైసీపీ ఎమ్మెల్యే ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంద‌ని టాక్‌. తాను నిజాయ‌తీ పరుణ్ని అని కార్య‌క‌ర్త‌ల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేద‌ని ఆ ఎమ్మెల్యే ఎన్నోసార్లు బ‌హిరంగంగా ప్ర‌క‌టించుకున్నారు. మిగ‌తా ఎమ్మెల్యేలు డ‌బ్బులు తింటారు అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడా ఎమ్మెల్యే అక్ర‌మ బండారం బ‌య‌ట ప‌డేలాగ ఉంద‌ని స‌మాచారం.

ఎవ‌రికి ఇవ్వ‌కుండా..ఇటీవ‌ల జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో వైసీపీ ప్ర‌భుత్వం ఓ ప‌థ‌కం తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ప‌థ‌కం కింద ఆ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గానికి రూ.58 కోట్ల వ‌ర్క్స్ వ‌చ్చాయ‌ని తెలిసింది. అందులో డ‌బ్బులు బాగా మిగులుతాయ‌ని బ‌య‌ట మాట్లాడుకున్నారు. దీంతో ఆ విష‌యం తెలిసిన క్యాడ‌ర్ వెళ్లి ఆ ప‌నులు త‌మ‌కు కేటాయించాల‌ని ఆ ఎమ్మెల్యేని అడిగారంటా.

కానీ ఆయ‌న మాత్రం ఎవ‌రికి ఎలాంటి కాంట్రాక్టు ఇవ్వ‌కుండా మొత్తం వ‌ర్క్స్ తానే పూర్తిచేశార‌ని ఆరోపిస్తున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యే వైఖ‌రిపై తీవ్ర విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఆ రూ.58 కోట్ల‌లో ప‌నుల కోసం ఖర్చు పెట్టింది కేవ‌లం రూ.16 కోట్లు మాత్ర‌మేన‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మిగ‌తా రూ.32 కోట్లు ఆ ఎమ్మెల్యేకు లాభ‌మ‌ని చెప్పుకుంటున్నారు.

బండారం వెలుగులోకి..ఎమ్మెల్యే అక్ర‌మ వ్య‌వ‌హారంపై వైసీపీ స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధి ఒక‌రు పోరాటం మొద‌లెట్టార‌ని టాక్‌. ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తూ వైసీపీ హైక‌మాండ్‌కు వివిధ చాన‌ళ్ల‌కు కార్య‌క‌ర్త‌ల‌తో లేఖ‌లు రాయిస్తున్నార‌ని తెలిసింది. మ‌రోవైపు అధిష్ఠానం కూడా ఆ ఎమ్మెల్యే విష‌యం క‌నుక్కోవాల‌ని ఫోన్ సర్వే నిర్వ‌హిస్తోంద‌ని స‌మాచారం.

ముఖ్యంగా వాలంటీర్ల‌తో పెద్ద ఎత్తున స‌ర్వే చేయిస్తుంద‌ని అంటున్నారు. అదే విధంగా ఇంటిలిజెన్స్ ద్వారా కూడా స‌మాచారం తెప్పించుకుంటున్న‌ట్లు టాక్‌. మ‌రోవైపు విజిలెన్స్ ద్వారా ఆ స‌ద‌రు ఎమ్మెల్యేపై విచార‌ణ జ‌రిపించాల‌నే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విష‌యంలో నిజానిజాలు ఎంతో తెలీదు కానీ ఆ ఎమ్మెల్యేపై ఆరోప‌ణ‌లు మాత్రం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పుడా నియోజ‌క‌వ‌ర్గంలో ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాల‌ని అక్క‌డి ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.