Begin typing your search above and press return to search.

తోలి స్థానం లో ప్రకాశం .. చివరి స్థానంలో కడప !

By:  Tupaki Desk   |   30 Aug 2021 10:32 AM GMT
తోలి స్థానం లో ప్రకాశం .. చివరి స్థానంలో కడప !
X
పొగ‌తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అనే విష‌యం తెలిసిందే. అయితే పొగ‌రాయుళ్లు మాత్రం ధూమ‌పానం అల‌వాటు వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ధూమ‌పానం ద్వారా ఆరోగ‌స్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే స్మోకింగ్ చేసే వారిలో మ‌ర‌ణించే అవ‌కాశాలు 50 శాతం ఉన్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యుహెచ్‌ వో) తెలిపింది. ధూమ‌పానం అల‌వాటును వెంట‌నే మానేయాల‌ని సూచించిన డ‌బ్ల్యుహెచ్‌ వో, దీనివ‌ల్ల కరోనా రిస్క్‌ తగ్గుతుందని, క్యాన్సర్‌, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది.

ఇదిలా ఉంటే .. ఆంధ్రప్రదేశ్‌ లో 15 ఏళ్లు పైబడిన వారిలో 22.6 శాతం మంది పొగరాయుళ్లేనని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేటతెల్లం అయ్యింది. ఇక, 15 ఏళ్లు దాటిన మహిళల్లో 3.8 శాతం మందికి ధూమపానం అలవాటు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. పురుషుల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 28.2 శాతం మంది పొగ తాగుతుండగా అత్యల్పంగా వైఎస్సార్‌ కడప జిల్లాలో 18 శాతం మందికి ఈ వ్యసనం ఉంది.

పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పొగతాగుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 15.8 శాతం పురుషులు పొగతాగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో 25.6 శాతం మంది పొగ తాగుతున్నారు. మహిళల్లో 1.9 శాతం మంది పట్టణాల్లో, 4.7 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో పొగ తాగుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహిళలు ఎక్కువగా పొగ తాగుతున్నట్లు సర్వే పేర్కొంది.

దేశంలో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు, పురుషులు పొగతాగుతున్నట్లు తేలింది. మిజోరాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో అత్యధికంగా మహిళలు, పురుషులు పొగతాగుతున్నట్లు సర్వే తెలిపింది. తెలంగాణలో 22.3 శాతం పురుషులు, 5.6 శాతం మంది మహిళలు పొగతాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే అత్యధికంగా బిహార్‌ లో 48.8 శాతం, గుజరాత్‌లో 41.1 శాతం, మహారాష్ట్రలో 33.8 శాతం మంది పురుషులు పొగతాగుతున్నట్లు సర్వే వెల్లడైంది.