Begin typing your search above and press return to search.

సంచలనం: 50మంది పోలీసులను సస్పెండ్ చేసిన ఎస్పీ

By:  Tupaki Desk   |   5 Sept 2020 11:00 AM IST
సంచలనం: 50మంది పోలీసులను సస్పెండ్ చేసిన ఎస్పీ
X
హీరో సూర్య సినిమాలు ‘సింగం’ సిరీస్ చూసే ఉంటారు. అవినీతిపై సింగంలా పోరాడే ఆ దృశ్యాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కానీ నిజంగా పోలీస్ శాఖలో అలా చేయవచ్చా? చేసే సాహసం పోలీసులు చేస్తారా? పైఅధికారుల ఒత్తిడిలు.. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి బెదిరింపులు.. ఇలా నానా రకాలుగా మూడో సింహం సైలెంట్ అయిపోతుంటుంది.

కానీ అచ్చం సింగంలానే రెచ్చిపోతున్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. తమ డిపార్ట్ మెంట్ లో అవినీతికి పాల్పడిన వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గత 10 రోజుల వ్యవధిలోనే ఎస్పీ సిద్ధార్థ్ ఏకంగా 50మందికి పైగా సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం ఏపీ పోలీస్ శాఖలో సంచలనమైంది. ఇవన్నీ అవినీతి వ్యవహారాల వల్ల జరిగినవే కావడం గమనార్హం.

నిజానికి పోలీస్ వ్యవస్థలో ఏం జరిగినా పెద్దగా బయటకు రాదు.. సస్పెన్షన్లను మీడియాకు లీక్ చేయరు.కానీ ఎస్పీ సిద్ధార్థ్ పోలీసు అవినీతిపై విచారణ కమిటీలు వేసి ఆరోపణలు నిజమని తేలితే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఆదేశించారు. అంతటితో ఊరుకోకుండా సస్పెండైన పోలీసుల వివరాలు.. వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలు మీడియాకు రిలీజ్ చేయడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది.

దీంతో సొంత పోలీస్ డిపార్ట్ మెంట్ లోనూ ఏస్పీ దూకుడుపై వ్యతిరేక స్వరాలు పెరిగిపోతున్నాయన్న చర్చ ప్రకాశం జిల్లాలో సాగుతోంది. ఏదిఏమైనా.. ఇన్నాళ్లకు రియల్ సింగంను చూసినట్టుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.