Begin typing your search above and press return to search.

పవన్ ప్రెస్ మీట్ వేళ.. 'పవర్ కట్'

By:  Tupaki Desk   |   21 May 2022 7:10 AM GMT
పవన్ ప్రెస్ మీట్ వేళ.. పవర్ కట్
X
ఏపీలో పవర్ కట్స్ ఏ రీతిలో ఉన్నాయో తెలిపే ఉదంతం తాజాగా వెలుగు చూసింది. పేరు ముందు 'పవర్' స్టార్ గా పిలిపించుకునే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో హటాత్తుగా పవర్ పోవటంతో సమావేశం నిర్వహించిన ప్రాంతం మొత్తం అంధకారం నెలకొంది. దీంతో.. చుట్టూ ఉన్న వీడియోగ్రాఫర్లు.. విలేరులు తమ చేతిలోని మొబైల్ ను టార్చ్ ల కింద మార్చారు. చివరకు పవన్ కల్యాణ్ సైతం తన చేతిలోని సెల్ ఫోన్ ను టార్చ్ కింద మార్చి సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అంధకారంలో ముంచెత్తినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. పవన్ మాట్లాడుతున్న వేళలో కరెంటు పోవటం.. దాదాపు 20 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో గమనార్హం.

ప్రస్తుతం 'ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇదీ..అంధకారంలో ఆంధ్రప్రదేశ్' అంటూ వ్యాఖ్యానించారు. ఎంతకూ కరెంటు రాకపోవటంతో.. జనరేటర్ సాయంతో లైట్లు వెలిగించారు.

మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేలా బీజేపీని సైతం ఒప్పిస్తానన్న వ్యాఖ్య చూస్తే.. కొత్త సమీకరణాల దిశగా పవన్ అడుగులు వేయనున్నారన్న భావన కలుగక మానదు. 'బీజేపీ హైకమాండ్ తో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండే అంశంపై చర్చిస్తా.

రాష్ట్రం బాగుండాలంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కనీస ఉమ్మడి కార్యక్రమంతో అందరం ముందుకు వెళ్లాలని భావిస్తున్నా. బీజేపీ అధినాయకత్వానికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పగలనని అనుకుంటున్నా' అని వ్యాఖ్యానించారు.

బీజేపీ అధినాయకత్వం పవన్ మాటల్ని వింటుందా? ఆయన వాదనను పరిగణలోకి తీసుకుంటుందా? అన్న సందేహాలకు సమాధానాలిస్తూ ఆయనో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. 'అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండాలని వారిని ఎలా ఒప్పించానో.. పొత్తుల విషయంలోనూ అదే విధంగా సాధిస్తాననే నమ్మకం ఉంది. నేను ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో వైసీపీ నేతలు ఎలా చెబుతారు? ఎవరిన మంత్రివర్గంలోకి తీసుకోవాలో మేం చెబితే వారు వింటారా?' అని వ్యాఖ్యానించారు.