Begin typing your search above and press return to search.

టీడీపీకి భారీ షాక్ .. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ?

By:  Tupaki Desk   |   22 Jan 2020 5:57 PM IST
టీడీపీకి భారీ షాక్ .. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ?
X
ఏపీ శాసన మండలిలో సీఆర్డీఏ రద్దు - అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై కీలక చర్చ జరుగుతున్న వేళ టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి. ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీకి గుడ్‌ బై చెప్పబోతున్నారు. త్వరలోనే సీఎం జగన్ సమక్షంలో ఆమె వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో మండలిలో బిల్లులపై ఓటింగ్ జరిగితే ఆమె వైసీపీకి అనుకూలంగా ఓటు వేయనున్నారు. మంగళవారం మండలిలో రూల్ 71 నోటీస్‌పై ఓటింగ్ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత - శివనాథ రెడ్డి వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారు. టీడీపీ సభ్యులంతా రూల్ 71కి మద్దతుగా ఓటేస్తే.. వీరిద్దరు మాత్రం వ్యతిరేకంగా ఓటువేశారు.

శాసనసభ, శాసన మండలి లాబీల్లో దీనిపై జోరుగా చర్చ సాగుతోంది. బుధవారమే ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో..వైసీపీ లో చేరబోతున్నారని చెబుతున్నారు. శాసనమండలిలో వైసీపీ సంఖ్యాబలం లేదు. ఈ పరిస్థితుల్లో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ.. అధికార పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన బలాన్ని పెంచుకోవడంలో భాగంగానే వైసీపీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని అంటున్నారు. అయితే తమ పార్టీలోకి చేరదలిచిన ఎమ్మెల్యేలు గానీ - ఎమ్మెల్సీలు గానీ.. తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందంటూ సీఎం జగన్ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించారు.

దీనికి అనుగుణంగానే నడుచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పోతుల సునీత తన పదవికి రాజీనామా చేస్తారా? లేక టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్ - మద్దాలి గిరిధర్ రావు తరహాలో ప్రత్యేక సభ్యురాలిగా ఉంటారా? అనేది తెలియాలి. ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ - ప్రస్తుత శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా చేసిన తరువాతే వైసీపీ లోకి చేర్చుకున్న విషయాన్ని పలువురు ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసిన తరువాతే.. పోతుల సునీతను పార్టీలోకి చేర్చుకుంటామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.