Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను నిజాంకు జ‌త చేసిన పోట్ల‌!

By:  Tupaki Desk   |   3 Nov 2017 10:15 AM GMT
కేసీఆర్‌ ను నిజాంకు జ‌త చేసిన పోట్ల‌!
X
మాకంటే తోపుల్లేరు.. ఎన్నిక‌లు జ‌రిగితే వంద సీట్లు ప‌క్కా.. కాదంటే మ‌రో ఐదారు సీట్లు కూడా మావే అంటూ ఆత్మ‌విశ్వాసంతో చెప్పే కేసీఆర్ మాట‌ల్ని ఇప్ప‌టివ‌ర‌కూ చాలానే విన్నాం. అధికారం ప‌క్కా.. మీ టికెట్ల‌ను ఆర్నెల్ల ముందే ఇచ్చేస్తా.. టికెట్ తో పాటు ఎన్నిక‌ల ఖ‌ర్చుల‌కు డ‌బ్బుల్ని చెక్కు రూపంలో ముందే ఇచ్చేస్తా అంటూ భ‌రోసాకు బ్రాండ్ అంబాసిడ‌ర్ అన్న‌ట్లుగా కేసీఆర్ ఇస్తున్న వ‌రాలు వింటే ఒళ్లు పుల‌క‌రించిపోవాల్సిందే.

ఇంత మంచిగా ఆలోచించే అధినేత ఏ రాజ‌కీయ పార్టీలో ఉంటారు? అందునా అధికార‌పార్టీ అధినేత‌గా పార్టీ నేత‌ల గురించి ఎంత దూరం ఆలోచ‌న చేస్తున్నారే అంటూ ఉక్కిరిబిక్కిరి అయిపోయే వాళ్లెంద‌రో. మ‌రి.. అలాంటి బ్ర‌హ్మాండ‌మైన అధినేత‌ను కాద‌ని కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవ‌టం ఈ మ‌ధ్య‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌ లోకి పోతున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. రెండు క‌ళ్లు.. రెండు క‌ళ్లు అంటూ తెగ చెప్పిన చంద్ర‌బాబు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను ఒప్పుకుంటున్న‌ట్లు లేఖ ఇచ్చిన త‌ర్వాతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్ర‌క్రియ ఊపందుకుంది. ఆయ‌న ఏ ఆశ‌తో చెప్పారో కానీ రెండు క‌ళ్ల సిద్ధాంతం అట్ట‌ర్ ప్లాప్ కావ‌ట‌మేకాదు.. ఈరోజున తెలంగాణ రాష్ట్రంలో స‌రైన నేత లేని ప‌రిస్థితి. ఇంకా దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. తెలంగాణ వ్యాప్తంగా క్యాడ‌ర్ లేని పార్టీల్లో టీడీపీ ఒక‌టిగా మారింది.

ఒక‌ప్పుడు తెలంగాణ‌లో బ‌ల‌మైన క్యాడ‌ర్ బేస్ ఉన్న రాజ‌కీయ పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీలో ఈ రోజు నేత‌ల కోసం వెతుక్కునే ప‌రిస్థితి. అలాంటి పార్టీలో ఉండే క‌న్నా.. టీఆర్ ఎస్ లేదంటే కాంగ్రెస్ కు వెళ్లిపోతున్నారు. కేసీఆర్ తో పేచీ ఉన్నోళ్ల‌కు కాంగ్రెస్ మాత్ర‌మే దిక్కు అవుతుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ.. స‌మ‌స్య అంతా ఇప్పుడు టీఆర్ ఎస్ తోనే.

మేం తోపులం.. మాక‌న్నా మొన‌గాళ్లు ఎవ‌రూ లేరు.. తెలంగాణ చాంఫియ‌న్లమ‌ని చెప్పుకునే గులాబీ పార్టీకి చెందిన నేత‌లు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్ల పేర్లు వినిపించిన‌ప్ప‌టికీ.. పార్టీని వీడిపోతాన‌ని అధికారికంగా చెప్పిన నేత‌గా మాజీ ఎమ్మెల్సీ.. ఖ‌మ్మం జిల్లాకు చెందిన పోట్ల నాగేశ్వ‌ర‌రావుగా చెప్పాలి.

తాజాగా తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా పోట్ల వెల్ల‌డించారు. పార్టీని వీడే క్ర‌మంలో టీఆర్ ఎస్ అధినేత క‌మ్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. తాను పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్నాన‌ని.. కేసీఆర్ పాల‌న నిజాం ఏలుబ‌డిని త‌ల‌పిస్తోందంటూ విమ‌ర్శ‌నాస్త్రాల్ని ఎక్కు పెట్టారు.

స‌చివాల‌యానికి రాకుండా ఉండే ముఖ్య‌మంత్రిని తాను ఇప్ప‌టివ‌ర‌కూ చూడ‌లేదంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. ఖ‌మ్మం జిల్లాకు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు రేణుకా చౌద‌రి ప్రోత్సాహంతో పాటు.. ఇటీవ‌ల పార్టీలో చేరిన రేవంత్‌ రెడ్డి కూడా పోట్ల ఎగ్జిట్‌ కు కార‌ణంగా చెబుతున్నారు. ఏమైనా అధికార‌ప‌క్షానికి చెందిన పార్టీ నేత‌.. భ‌విష్య‌త్ అన్న‌ది లేద‌ని చెబుతున్న కాంగ్రెస్‌ లోకి ప్ర‌యాణం కావ‌టం అంటే.. కేసీఆర్ ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల్సిన టైం వ‌చ్చిన‌ట్లే.