Begin typing your search above and press return to search.

గుంతలు పడిన రోడ్డు మీద జర్నీ చేస్తే మీకు.. మీ బండికి ఏమవుతుంది?

By:  Tupaki Desk   |   22 Oct 2020 2:04 PM IST
గుంతలు పడిన రోడ్డు మీద జర్నీ చేస్తే మీకు.. మీ బండికి ఏమవుతుంది?
X
గురి చూసి కొట్టినట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల మరమ్మతులు.. కొత్తగా రోడ్లు వేయటం లాంటివి సరిగ్గా వర్షాలకు మూడు.. నాలుగు నెలల ముందే జరుగుతుంటాయి. ఎన్నో ఏళ్లుగా.. ఒకేలాంటి అనుభవం ఎదురైనప్పటికీ.. రోడ్లను వేసే టైంటేబుల్ మార్చని పరిస్థితి. తాజాగా తెలంగాణ విషయానికే వస్తే.. ఎండాకాలం పూర్తి అయ్యే వేళలో రోడ్లను వేశారు. వందలాది కిలోమీటర్లు రోడ్లను మెరుపర్చారు.

ఫర్లేదు..ఇప్పుడిప్పుడే రోడ్లు బాగుపడుతున్నాయి.. అనుకున్నంతలోనే లాగి పెట్టి కొట్టినట్లుగా భారీ వర్షం.. దాని వెంటే వచ్చిన వరదలతో హైదరాబాద్ మహానగరంలోని వేలాది కిలోమీటర్ల మేర రోడ్లు చెడిపోయాయి. ప్రధాన రహదారుల్లో సైతం పెద్ద పెద్ద గుంతలు.. రోడ్ల మీద కంకర తేలాయి. దీంతో.. రోజుకు వందలాది మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఇవేమీ రిపోర్టు కావటం లేదు. గుంతల్లో ప్రయాణించే వేళలో.. ప్రజలు పడుతున్న కష్టాలకు తాజాగా అనారోగ్యం తోడైంది.

గుంతల్లో ప్రయాణం చేయటం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. గుంతలు పడిన రోడ్ల మీద టూవీలర్ ప్రయాణం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. డిస్క్ లపై ప్రభావం చూపుతుందని.. మెడ.. వెన్నులో డిస్కుల మధ్య గ్యాప్ రావటం.. ఒకే దగ్గరకు రావటం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా నరాలపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు.

మెడ వద్ద డిస్కుల్లో సమస్యలు ఉంటే.. స్పాండిలైటిస్.. చేతుల్లో తిమ్మిర్లు రావటం జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే పనిగా టూవీలర్ మీద ప్రయాణించే వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉందంటున్నారు. ఇలా ఒంటి మీదనే కాదు.. గుంతల రోడ్ల మీద ప్రయాణించే వాహనాలు సైతం దెబ్బ తింటాయని నిపుణులు చెబుతున్నారు. గుంతల్లో రోడ్డు ప్రయాణం కారణంగా అదే పనిగా గేర్లు మార్చాల్సి వస్తుందని.. అందువల్ల క్లచ్ ప్లేట్లు.. గేర్లు త్వరగా దెబ్బ తినే అవకాశం ఉందంటున్నారు.

కార్ల విషయానికి వస్తే.. చక్రాల మధ్య అలైన్మెంట్ మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్లకు దగ్గర దగ్గర 13 రకాల రిపేర్లకు అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా గోతులున్న రోడ్ల మీద ప్రయాణం ఒంటికే కాదు.. జేబుకు సైతం చిల్లుపెట్టేయటం ఖాయం. సో.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మన మీదనే ఉందన్నది మర్చిపోకూడదు.