Begin typing your search above and press return to search.

ఏంటయ్యా: యాంటిజెన్‌ టెస్ట్ లో పాజిటివ్ ... ఆర్టీపీసీఆర్‌లో నెగటివ్ !

By:  Tupaki Desk   |   23 March 2021 7:00 PM IST
ఏంటయ్యా: యాంటిజెన్‌ టెస్ట్ లో పాజిటివ్ ... ఆర్టీపీసీఆర్‌లో నెగటివ్ !
X
కరోనా సెకండ్ వేవ్ మొదలైంది అంటూ దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా భయంతో వణికిపోతున్నారు. వ్యాక్సిన్ వచ్చింది ఇక మళ్లీ పాత రోజులు రాబోతున్నాయి అని అనుకుంటే ఇదేంటి మళ్లీ అని అందరూ ఆందోళనకి గురౌతున్నారు. ఇదిలా ఉంటే కరోనా నిర్దారణ కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు కిట్ల నాణ్యత పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతూ వైరస్‌ నిర్ధారణ కోసం వచ్చిన బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. వైరస్‌ లేనివారికి ఉన్నట్లు...ఉన్న వారికి లేనట్లు రిపోర్టులు వస్తుండటంతో వైద్యులు , బాధితులు ఇద్దరూ ఆందోళన చెందుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే .. నగరంలోని బోయిన్‌పల్లి గిరిజన సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు నిర్వహించిన యాంటిజన్‌ టెస్టులు, జారీ చేసిన రిపోర్టులే ఇందుకు నిదర్శనం. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థలో పనిచేస్తున్న కొంత మంది అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను పరిశీలించకుండా నాసిరకం కిట్లను కొనుగోలు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు సీనియర్‌ వైద్యులు ఆరోపిస్తున్నారు. వైరస్‌ విస్తరణకు ఈ తప్పుడు రిపోర్టులు కూడా ఓ కారణమని చెబుతున్నారు. కోవిడ్‌ నిర్ధారణలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ను ఎక్కువగా విశ్వసిస్తారు.

ఇందులో వైరస్‌ నిర్ధారణకు 24 గంటలకుపైగా సమయం పడుతుంది. అదే ర్యాపిడ్‌ యాంటిజెన్‌లో అరగంటలోనే ఫలితం తేలుతుంది. సత్వర వైరస్‌ నిర్ధారణ, చికిత్సల కోసం ప్రభుత్వం ఈ కిట్‌ల వైపు మొగ్గుచూపింది. అయితే దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, ఆయాసం వంటి కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులో నెగిటివ్‌ రావడం సహజమే. ఇలాంటి వారికి వైద్యులు ఖచ్చితత్వం కోసం ఆర్టీపీసీఆర్‌ను సిఫార్సు చేసి, ఆ రిపోర్ట్‌ ఆధారంగా వైరస్‌ ను నిర్ధారిస్తారు. నిజానికి యాంటిజెన్ ‌లో పాజిటివ్‌ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్‌ లోనూ పాజిటివ్‌ రావాలి. కానీ బోయిన్ ‌పల్లి గిరిజన సం క్షేమ వసతి గృహంలో నిర్వహించిన క్యాంపులో పాజిటివ్‌ వచ్చిన వారిలో, ఇద్దరికి మినహా అందరికీ ఆ తర్వాత నెగిటివ్ గా తేలింది. ఒక వైపు కిట్ల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతుండగా...మరో వైపు గ్రేటర్‌లో చాపకిందినీరులా వైరస్‌ విస్తరిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. తాజాగా సోమవారం కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.