Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ :ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు..33కు చేరిన కరోనా కేసులు!

By:  Tupaki Desk   |   23 March 2020 11:42 AM GMT
బ్రేకింగ్ :ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు..33కు చేరిన కరోనా కేసులు!
X
కరోనా పై తెలంగాణ సర్కార్ యుద్ధం ప్రకటించినప్పటికీ .. కరోనా వ్యాప్తి రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ లో సోమవారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మీడియా సమావేశంలో తెలిపారు. అయితే, బాధితులు కోలుకుంటున్నారని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు.

దీనితో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది. వీరిలో ఒకరు కోలుకొని డిశ్చార్జి కాగా.. మరో 32 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మరో 97 మంది అనుమానితులు ఉన్నారని.. వారి రిపోర్టులు పుణె వైరాలజీ ల్యాబ్ నుంచి రావాల్సి ఉందని చెప్పారు ఈటల రాజేందర్. ఇప్పటివరకు వైరస్‌ కారణంగా మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కరోనాను ఎదుర్కోవడం కష్టమేమీ కాదని చెప్పారు.

కాగా, మొన్నటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే కరోనా కనిపించగా.. ఇప్పుడు తెలంగాణ స్థానికులకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పేషెంట్లకు దగ్గరగా మెలగడం వలన వారికి కరోనా సంక్రమించింది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రజల కోసమే కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆదేశాలను తప్పక పాటించాలని చెప్పారు. ఆదేశాలను పట్టించుకోకపోతే చర్యలు తప్పవని అన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగొద్దని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలని తెలిపారు.