Begin typing your search above and press return to search.

మోడీ..చంద్రబాబు..సోనియాల్లో రాష్ర్టపతి ఎవరవుతారు?

By:  Tupaki Desk   |   15 Jun 2017 9:14 AM GMT
మోడీ..చంద్రబాబు..సోనియాల్లో రాష్ర్టపతి ఎవరవుతారు?
X
రాష్ర్టపతి ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కదలిక వచ్చింది. దేశ అత్యున్నత పీఠం ఎవరు అధిరోహిస్తారన్న విషయంలో అన్ని రాష్ర్టాల్లోనూ రాజకీయ - పాత్రికేయ వర్గాలు - సామాన్యులు వివిధ పేర్లపై చర్చించుకుంటున్నారు. బీజేపీ వ్యూహాలు... మోడీ ఎత్తుగడలు - ఆయన మనోభీష్టాల ప్రాతిపదికగా రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి.

బీజేపీ నుంచి దీనిపై ఎలాంటి సంకేతాలు రానప్పటికీ వివిధ వర్గాల్లో పదుల సంఖ్యలో పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో చాలాకాలం నుంచి నానుతున్న పేర్లు - బలమైన అంచనాలు - గాసిప్స్ కూడా ఉన్నాయి. ఏది నిజం - ఏది సాధ్యం అన్నది పక్కన పెడితే ప్రస్తుతం ఈ పదవికి వినిపిస్తున్న పేర్లన్నీ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటోంది.

సుమిత్ర మహాజన్

ప్రస్తుతం ఎన్డీయే వర్గాల నుంచి సుమిత్రా మహాజన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఎన్డీయే పరిశీలనలో ఉన్న పేర్లలోనూ ఆమె టాప్ 3లో ఉన్నట్లు సమాచారం. కానీ... ప్రధాని సొంత రాష్ర్టమైన గుజరాత్ కే చెందిన వ్యక్తి కావడంతో ఆ కోణంలో అభ్యంతరాలు రావొచ్చు.

వెంకయ్యనాయుడు

ప్రస్తుత కేంద్రమంత్రి. ప్రధానికి నమ్మిన బంటు. బీజేపీలో కీలక నేత - ఆరెస్సెస్ తో మంచి సంబంధాలున్న వ్యక్తి. విపక్ష నేతలతోనూ మంచి పరిచయాలు. దక్షిణాదిలో ఆమోదయోగ్యమైన వ్యక్తి.

చంద్రబాబునాయుడు..

ఎన్డీయేకు చిరకాల మిత్రుడు. ఏపీ సీఎం అయినా కూడా దేశ రాజకీయాల్లో అందరికీ తెలిసిన వ్యక్తి. మేధావి - చురుకైనవాడు - వ్యవహార దక్షుడు అన్న పేరుంది. పైగా తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఏపీని తన కుమారుడు లోకేశ్ కు అప్పగించాలని లోలోన ఉబలాటపడుతుండడతో ఆ దిశగా పరిశీలించొచ్చన్నది వినికిడి. ఇందుకు చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అన్నది ప్రశ్న.

మనోహర్ పారికర్

గోవా సీఎం. మొన్నటివరకు కేంద్రంలో రక్షణ మంత్రి. ఆయన శక్తి సామర్థ్తయాలపై మోడీకి గట్టి నమ్మకం. బలమైన మంత్రి వర్గ స్థాపన కోసం కేంద్ర మంత్రివర్గంలోకి తెచ్చినా మళ్లీ గోవా అవసరాల కోసం అక్కడికే పంపించగా కిమ్మనకుండా వెళ్లారు. అయితే.... మూడేళ్లలోనే ఒక వ్యక్తికి ఇన్ని స్థాన మార్పిడులు చేస్తారా అన్నది చూడాలి.

సురేశ్ ప్రభు

మోడీ కోసం శివసేనను వదిలొచ్చి కేంద్రంలో మంత్రిగా చేరారు. పనిమంతుడు - ఆలోచనా పరుడు. తెలివైన వ్యక్తి. వివాద రహితుడు.

వసుంధర రాజె సింధియా

సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న మహిళా నేత. బీజేపీలో మంచి సంబంధాలు. అయితే... లలిత్ గేట్ కుంభకోణం వంటి వివాదాలు అడ్డంకి.

సుష్మా స్వరాజ్

బీజేపీలో, ఆరెస్సెస్ లో దాదాపుగా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి. కానీ... ప్రధాని మోడీకి ప్రచ్ఛన్న పోటీదారే. ప్రస్తుతం సైలెంటుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నా బలమైన అధికారం అందివస్తే ఎలా మారుతారో అన్న భయం మోడీకి ఉండొచ్చు. కాబట్టి మోడీకి ఆమోదయోగ్యం కాకపోవచ్చు.

యోగి ఆదిత్యనాథ్...

ప్రధాని మోడీకి ఇష్టం లేకున్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కూడా తలొగ్గేలా చేసి యూపీ సీఎం అయిన ఫైర్ బ్రాండ్ యువనేత. దేశం దృష్టిని ఆకర్షించిన పొలిటికల్ సన్యాసి. తన పని తీరుతో అందరి దృష్టిలో పడ్డారు. భవిష్యత్తులో మోడీ స్థానం ఆయనదేనన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ను రాష్ర్టపతి స్థానానికి పంపి సైడ్ చేయాలని మోడీ అనుకోవచ్చు. కానీ... కరడుగట్టిన హిందూవాది అయిన యోగి విషయంలో మిత్రపక్షాలు, విపక్షాలు కచ్చితంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి. అదేసమయంలో మొన్నమొన్నే యూపీ సీఎం అయిన వ్యక్తిని అంతవేగం మార్చకపోవచ్చు.

జస్టిస్ సదాశివం

మాజీ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుతం కేరళ గవర్నరు - మేధావి - న్యాయకోవిదుడు - వివాద రహితుడు. బీజేపీ కలల రాష్ర్టం తమిళనాడు వాసి.

అమితాబ్ బచ్చన్

నటుడిగా దేశవ్యాప్త ఆదరణ. బీజేపీతో మంచి సంబంధాలు. ఇంతకుముందు కూడా ఈయన పేరు వినిపించింది. కానీ.. ప్రస్తుతం అవకాశాలు తక్కువే.

రజనీకాంత్

ఒకప్పుడు ఈ పేరు వినిపించినా బలంగా వినిపించలేదు. పైగా ఆయన రాజకీయ పార్టీ పెడుతుండడంతో ఆయనకూ అవకాశాలు తక్కువే.

ద్రౌపది ముర్ము

జార్ఖండ్ - ఒడిశాల్లోనూ పెద్దగా జనానికి తెలియని నేత. ఆదివాసీ - మహిళ కావడం అర్హతలు. అయినా... ఆమె పేరు ప్రస్తుత ఫైనల్ లిస్టులో లేనట్లు తెలుస్తోంది.

అమిత్ షా

మోడీకి కుడిభుజం. కానీ, ఆయన లేకుండా 2019 ఎన్నికలకు మోడీ వెళ్లరు.

నరేంద్ర మోడీ

ఈ గాసిప్ కూడా ఉంది. తాను రాష్ర్టపతిగా వెళ్లి. టర్కీ మాదిరిగా ప్రధాని కంటే రాష్ర్టపతిని కీలకం చేసేలా మార్పులు చేసి భారత్ లో పాలనా వ్యవస్థనే మార్చాలన్న ఉద్దేశం మోడీ మనసులో ఉందనేవారూ ఉన్నారు. టర్కీలో ఇలాంటి పరిణామాలను ఇటీవల ఆ దేశస్థులు, ప్రపంచం ఆమోదించిన నేపథ్యంలో 70 ఏళ్లుగా భారత్ లో ఉన్న పాలనా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు మోడీ స్వయంగా రాష్ర్టపతి అవ్వాలనుకుంటున్నారనే వాదనా ఉంది. కానీ.... ఇది దాదాపుగా అసాధ్యమనే అనుకోవాలి.

సోనియా గాంధీ

ఇది కూడా గాసిప్పే.. రాజీవ్ మరణం తరువాత సోనియా ప్రధాని కాకుండా ఆ పదవిని త్యాగం చేశానాని చెప్తుంటారు. ప్రధాని కావాలన్న ఆశ కూడా ఆమెలో ఉంది. అలాగే కుమారుడు రాహుల్ ను చేయాలనుకుంటున్నా అలాంటి అవకాశం కనుచూపు మేరలో కనిపించడంలేదు. దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చిన సోనియాకు రాష్ట్రపతి పదవి కూడా తమ కుటుంబానికి కావాలన్న కోరిక ఉందంటారు. ఆమె కూడా అనారోగ్యంతో ఉండడంతో ఆమెనే రాష్ర్టపతిగా ప్రతిపాదించి భారత రాజకీయాల్లో సరికొత్త ట్రెండు సృష్టించడంతో పాటు ఇప్పటికే చతికిలపడిన కాంగ్రెస్ ను మొత్తం బీజేపీ వైపు తిప్పుకునేందుకు మోడీ ఇలాంటి సాహసోపేతమైన ఎత్తుగడ వేస్తే ఎలా ఉంటుందనే కాల్పనిక ఆలోచనలూ చేసేవారూ ఉన్నారు. సోనియాను రాష్ర్టపతిని చేసి దేశ ప్రజల దృష్టిలో, కాంగ్రెస్, ఇతర విపక్షాల దృష్టిలో హీరో కావడం.. ఇదే అదనుగా కాంగ్రెస్ ను మొత్తం ఖాళీ చేయడం.. అన్ని విపక్షాలను లేకుండా చేసేలా మోడీ ప్లాన్ చేసినా చేయొచ్చనే వారున్నారు. కానీ.. ఇది వెయ్యి శాతం అసాధ్యమన్నది అందరి భావన.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/