Begin typing your search above and press return to search.

పూనావాలా చెప్పినప్పుడే స్పందించి ఉంటే.. ఈ దరిద్రం ఉండేదా?

By:  Tupaki Desk   |   19 April 2021 6:00 PM IST
పూనావాలా చెప్పినప్పుడే స్పందించి ఉంటే.. ఈ దరిద్రం ఉండేదా?
X
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుందో.. తాజాగా భారత్ పరిస్థితి అదే తీరులో ఉంది. రోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు.. మరోవైపు బెడ్ల కోసం భారీ ఎత్తున కొరతతో పాటు.. కరోనా తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రోగులు.. నిండిపోయిన ఆసుపత్రుల ముందు.. బెడ్ల కోసం పడుతున్న పాట్లు.. చేస్తున్న వినతులు ఎవరి చెవిని పట్టని దుస్థితి. ఎందుకీఅవస్థ? ఎవరిదీ పాపం? ఎవరికి శిక్ష? లాంటి ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.

ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ చేసే మన దేశం.. ఈ రోజున రష్యా నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి. ఎందుకిలా? తప్పు ఎక్కడ జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్న. దీనికి సమాధానం వెతికే క్రమంలో కాస్త వెనక్కి వెళితే.. కొన్ని ఉదంతాలు కనిపించటమే కాదు.. పాలకులకు ముందు చూపు లోపిస్తే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తాజా పరిస్థితుల్ని చూస్తే అర్థమవుతుంది.

కొద్ది నెలల క్రితం కోవీషీల్డ్ టీకాకు అనుమతి ఇవ్వటంలో కేంద్రం ఆలస్యం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాటిని సరైన ప్రొసీజర్ పాటించటం కోసమని సర్దిచెప్పుకున్నా.. ఆ తర్వాతి కాలంలో సీరం సంస్థ అధినేత పూనావాలా మాట్లాడుతూ.. తాము ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ ఐదుకోట్ల డోసుల నిల్వలు ఉన్నాయని.. మరిన్ని తయారు చేస్తే తన ఇంట్లో దాచుకోవాల్సి ఉంటుందన్న వ్యాఖ్య చేసిన వెంటనే.. ప్రధాని మోడీ కల్పించుకొని ఉండాల్సింది.

ఒకవేళ మోడీకి కుదరకపోతే.. కనీసం కేంద్రంలోని వారైనా స్పందించాల్సి ఉంది. కానీ.. ఎవరికి ఈ విషయం పట్టలేదు. దీంతో.. నిల్వలు భారీగా ఉండటంతో సీరం సంస్థ టీకా ఉత్పత్తిని ఆపేసింది. ఇంతేనా.. టీకా అందుబాటులోకి వచ్చిన వేళలో.. దేశానికి అవసరమైన టీకాల్ని ఆర్డర్ ఇవ్వకపోవటంతో.. పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఇదే.. మోడీ సర్కారు చేసిన అతి పెద్ద తప్పు. టీకాల ఉత్పత్తిని ఆపేసిన సమయంలో కలుగజేసుకున్నా.. లేదంటే.. దేశానికి అవసరమైన వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చి.. టీకా కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించి ఉంటే.. ఈ రోజున సెకండ్ వేవ్ ఇంత తీవ్రంగా అయితే ఉండేది కాదు.

రాక రాక వచ్చే అద్భుతమైన అవకాశాన్ని మోడీ సర్కారు దారుణంగా మిస్ చేసుకుంది. అంతేకాదు.. తమ టీకా ఉత్పత్తిని పెంచుకోవటానికి కేంద్రాన్ని రూ.3వేల కోట్లు అడిగితే.. ఇప్పటివరకు స్పందించింది లేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి రూ.3వేల కోట్లు పెద్ద విషయం కాదు. దేశ ప్రజల టీకా కోసం ఈ భారీ మొత్తాన్ని అందిస్తామన్న హామీ ఇచ్చేసి.. పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తిని చేపట్టి ఉంటే.. సెకండ్ వేవ్ ఇంత తీవ్రంగా ఉండేది కాదేమో. ఇవాల్టికి 45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు. సోనియాగాంధీ డిమాండ్ చేసినట్లుగా పాతికేళ్ల వరకు ఉన్న వారందరికి టీకా వేయటానికి ఇంకెంత కాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి.

సెకండ్ వేవ్ తో తన ప్రతాపాన్ని చూపించటానికి ముందు.. కాస్త విశ్రాంతి తీసుకున్న వేళలో.. మోడీ సర్కారు నిద్ర లేచి ఉంటే.. ఈ రోజున ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని చెప్పక తప్పదు. ఒక విధంగా చెప్పాలంటే.. పూనావాలా నెత్తి నోరు కొట్టుకున్నప్పుడే మోడీ సర్కారు నిద్ర లేచి.. అతను చెప్పిన మాటల్ని విని ఉంటే.. ఈ రోజున దేశం ఇప్పుడున్న దారుణ పరిస్థితిని ఎదుర్కొని ఉండేది కాదని చెప్పక తప్పదు.