Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'పొన్నూరు'లో టైట్‌ ఫైట్‌..!

By:  Tupaki Desk   |   30 March 2019 12:18 PM IST
గ్రౌండ్ రిపోర్ట్: పొన్నూరులో టైట్‌ ఫైట్‌..!
X
అసెంబ్లీ నియోజకవర్గం : పొన్నూరు (గుంటూరు జిల్లా)

టీడీపీ: ధూళిపాళ్ల నరేంద్ర
వైసీపీ: కిలారి రోశయ్య

గుంటూరు జిల్లాలో టీడీపీకి తిరుగులేని నియోజకవర్గం పొన్నూరు. అలాగే ధూళిపాళ్ల కుటుంబానికి పెట్టని కోట. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ కుటుంబానికి చెందిన వారు1983లో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఎన్నికవగా ఆయన తనయుడు నరేంద్ర ఐదుసార్లు గెలుస్తూ వస్తున్నారు. 1989లో మినహా మిగిలిన అన్నిసార్లు ఆ కుటుంబ సభ్యులే విజయం సాధించడం విశేషం.

పొన్నూరు నియోజకవర్గ చరిత్ర:

మండలాలు: పొన్నూరు, పెద్దకాకానిపాడు, చేదోడు

ఓటర్లు: 2 లక్షలు

పొన్నూరు నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదట కాంగ్రెస్‌, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ జెండానే ఎగురుతోంది. 1989లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీయడంతో వీరయ్య చౌదరి ఓటమి చెందారు. ఇక 1994లో ఆయన తనయుడు నరేంద్ర పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి 2014వరకు ఆయనదే హవా కొనసాగుతోంది. ఎక్కువ మంది మహిళా ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ తరువాత ఎస్సీ, బీసీ ఓటర్లు అభ్యర్థి గెలుపులో కీలకంగా ఉంటున్నారు.

* డబుల్‌ హ్యాట్రిక్‌పై నరేంద్ర గురి..

1994 నుంచి వరుసగా గెలుస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర ఈసారి గెలుస్తాడా..? అనే కోణంలో చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రిపదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఆ వర్గం వారు ఉన్నారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమాత్య పదవి రాలేదని తెలుస్తోంది. మరోవైపు నరేంద్రకు ఓ డెయిరీ ఉంది. ఆయన ఎక్కువగా దీనిపైనే దృష్టి పెడతాడని, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోడనే ఆరోపణ ఉంది. అయినా ఒకే కుటుంబానికి చెందిన ఈయనను ఐదుసార్లు ఎన్నుకోవడం అంటే ఆ ప్రజల్లో ఎలాంటి నమ్మకం ఉందో చెప్పవచ్చు. నియోజకవర్గంలో ప్రబలంగా బీసీ, కమ్మ సామాజికవర్గాలు టీడీపీ అండదండలు, అధికార పార్టీలో ఉండడంతో ధూళిపాళ్ల ప్రత్యర్థి కంటే అన్ని విషయాల్లో బలంగా ఉన్నారు.

* అనుకూలతలు:

-ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసు దోచుకోవడం
-కమ్మ - బీసీ సామాజిక వర్గం సపోర్టు
-వ్యక్తిగత ఇమేజ్‌ను సంపాదించుకోవడం

*ప్రతికూలతలు:

-ఆశించిన అభివృద్ధి సాధించకపోవడం
-కొన్ని సామాజిక వర్గాలు దూరం కావడం

* వైసీపీ జెండా ఎగురవేయడానికి కిలారి రోశయ్య పట్టు..

టీడీపీకి పట్టున్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్‌ ప్రత్యేక వ్యూహం పన్నాడు. గతంలో పోటీ చేసి రావి వెంకటరమణ ఓడిపోవడంతో ఈసారి ఆ పార్టీ కిలారి రోశయ్యకు అవకాశం ఇచ్చింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఈయన ధూళిపాళ్ల నరేంద్రకు గట్టిపోటీనే ఇస్తున్నారు. మరోవైపు సీనియర్‌ రాజకీయ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు రోశయ్య అల్లుడు. దీంతో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఐదుసార్లు గెలిచిన ధూళిపాళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయలేదని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ గాలి.. ధూళిపాళ్లపై తీవ్ర వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని ఆశిస్తున్నాడు. ఇక నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కాపు సామాజికవర్గం ఓటర్లు కిలారీ వెంట ఉండడంతో ఈయన గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు.

* అనుకూలతలు:

-సీనియర్‌ రాజకీయ నేత వెంకటేశ్వర్లు సపోర్టు
-కాపు సామాజిక వర్గ ఓట్లు కలిసి రావడం
-నరేంద్రపై వస్తున్న వ్యతిరేకత

* ప్రతికూలతలు:

-టీడీపీకి కంచుకోట
-పోటీకి కొత్త అభ్యర్థి కావడం

*టఫ్ ఫైట్ లో గెలుపెవరిది?

మొత్తానికి ఈసారి జరిగే ఎన్నికల్లో ధూళిపాళ్ల కుటుంబానికి కిలారి రోశయ్య చెక్‌పెట్టే అవకాశముందా లేదా అన్నదే ఉత్కంఠగా మారింది. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కులాలే కీలకంగా మారనున్నాయి. ఆయా కుల సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మద్దతు కోసం ఇరు అభ్యర్థులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వరుసగా ఐదుసార్లు ఎన్నికైనా ధూళిపాళ్ల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పట్టించుకోకపోవడంతో ఈసారి గెలుపు అంత ఈజీ కాదంటున్నారు. మరోవైపు వైసీపీ కొత్త అభ్యర్థి ధూళిపాళ్ల లాంటి బలమైన నేతను ఓడిస్తాడన్న అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే ధూళిపాళ్లపై వరుసగా గెలవడంతో కాసింత వ్యతిరేకత ఉంది. అదే బలమవుతుందని కిలారి అంచనావేస్తున్నారు. పైగా వైసీపీ గాలి సానుభూతి ఓట్లు పడే అవకాశముందని అంటున్నారు. మొత్తంగా ఈ టఫ్ ఫైట్ లో ఎవరు గెలుస్తారనే విషయంలో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది.