Begin typing your search above and press return to search.

ఉలిక్కిపడేలా చేసిన పొన్నం..అల్లుడిమాట

By:  Tupaki Desk   |   9 Sept 2015 10:18 AM IST
ఉలిక్కిపడేలా చేసిన పొన్నం..అల్లుడిమాట
X
వాస్తవం సంగతి ఎలా ఉన్నా.. బురద వేయటంలో రాజకీయ నాయకుల తర్వాతే ఎవరైనా. తన పని తాను చేసుకుపోయే మంత్రి హరీశ్ ను ఇరుకున పెట్టేందుకు.. ఇబ్బంది పెట్టేందుకు వీలుగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ ఒక వ్యాఖ్య చేస్తుంటారు. తాజాగా కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు హరీశ్ కు చిరాకు పుట్టించటంతో పాటు.. కేసీఆర్ ను బద్నాం చేయటం ఖాయమని చెబుతున్నారు.

తెలంగాణ అధికారపక్షంలో కేటీఆర్.. హరీశ్ రెండు వర్గాలు ఉన్నప్పటికీ.. కేసీఆర్ పుణ్యమా అని ఎవరికి వారు తమ తమ హద్దుల్లోనే వర్గ రాజకీయాల్ని నడిపిస్తుంటారు. ఈ ఇద్దరికి కేసీఆర్ అంటే ఉండే భయం.. భక్తి కారణంగా తమ వర్గ రాజకీయాల్ని పార్టీకి ఇబ్బంది కలిగేలా చేయరన్న వాదన ఉంది.దీన్ని సాకుగా తీసుకొని విపక్ష నేతలు విమర్శలు చేస్తుంటారు.

తాజాగా ఇలాంటి వ్యాఖ్యల్ని చేశారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. చైనా పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తన వెంట అసెంబ్లీ స్పీకర్.. శాసన మండలి ఛైర్మన్ ను వెంట తీసుకెళ్లటానికి తనదైన భాష్యం చెప్పుకొచ్చారు. తాను చైనా పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న మేనల్లుడు ఎక్కడ ప్రభుత్వాన్ని కూలుస్తాడో అన్న అభద్రత భావంతో.. భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్.. మండలి ఛైర్మన్ లను వెంట పెట్టుకెళ్లారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లో నిజం లేకున్నా.. బురద వేయటానికి.. అందరి దృష్టిని ఆకర్షించటానికి మాత్రం పనికొస్తాయనటంలో సందేహం లేదు.