Begin typing your search above and press return to search.

పోలీసులు రక్షించకుంటే సజీవ దహనమయ్యేవాళ్లం: ఎమ్మెల్యే పొన్నాడ

By:  Tupaki Desk   |   25 May 2022 7:35 AM GMT
పోలీసులు రక్షించకుంటే సజీవ దహనమయ్యేవాళ్లం: ఎమ్మెల్యే పొన్నాడ
X
ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన హింసలో మంత్రి విశ్వరూప్ కు చెందిన రెండు ఇళ్లు, ముమ్మిడివరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కు చెందిన ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన పొన్నాడ సతీష్ కుమార్ ముమ్మిడివరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆయన అమలాపురంలోనే నివాసముంటున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఆయన నియోజకవర్గం ముమ్మిడివరం కోనసీమ జిల్లాలోనే కలిసింది.

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా ఇటీవల ప్రభుత్వం పేరు మార్చడంపై అమలాపురంలో ఆందోళనకారులు రెచ్చిపోయిన సంగతి విదితమే. జిల్లా కలెక్టరేట్ తోపాటు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు నిప్పు పెట్టారు.

ఈ ఘటనపై మాట్లాడిన పొన్నాడ సతీష్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆందోళనకారులు తన ఇంటిపై దాడి చేసినప్పుడు ఇంటిలో తనతోపాటు తన భార్య, కుమారుడు ఉన్నారని తెలిపారు. నిరసనకారులు పెట్రోలు డబ్బాలు తీసుకొచ్చి తన ఇంటిపై చల్లి నిప్పు పెట్టారని చెప్పారు.

పోలీసులు సకాలంలో రాకుంటే తాము ఆందోళనకారుల చేతిలో సజీవ దహనమయ్యేవాళ్లమని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులతోపాటు తన అనుచరులు సకాలంలో తమను రక్షించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని తెలిపారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపితే కానీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదన్నారు.

పోలీసులు, తన అనుచరులు, తాను వారిస్తున్నా వినకుండా తన ఇంటికి నిప్పు పెట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో పోలీసులను కూడా తోసి పారేశారని.. దీంతో పోలీసులు లాఠీచార్జు చేయడంతోపాటు గాలిలోకి కాల్పులు జరిపారని తెలిపారు. దీంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారని.. లేదంటే తాను, తన భార్య, కుమారుడు సజీవ దహనమయ్యేవారమని వివరించారు.

కాగా అమలాపురంలో పోలీసులు.. ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులతోపాటు అన్ని సినిమా షోలను తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రస్తుతం డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల పోలీసులను అమలాపురంలో మోహరించారు. 144 సెక్షన్ తోపాటు 30 సెక్షన్ విధించారు. అమలాపురంలోకి కొత్త వ్యక్తుల రాకపోకలను నిషేధించారు. సీసీ పుటేజ్ లు, వాట్సాప్ మెసేజుల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.