Begin typing your search above and press return to search.

కుప్పం పుర‌ పోలింగ్ ప్ర‌శాంతం

By:  Tupaki Desk   |   16 Nov 2021 2:49 PM GMT
కుప్పం పుర‌ పోలింగ్ ప్ర‌శాంతం
X
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం కుప్పం మునిసిపాలిటీకి మంగ‌ళ‌వారం జ‌రిగిన పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని ప్ర‌క‌టించారు. కుప్పం మునిసిపాలిటీకి తొలి సారి జరుగుతున్న ఈ ఎన్నిక‌ల‌పై స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ముగిసిన పంచాయ‌తీ, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీకి ఘోర ప‌రాజ‌యం ద‌క్క‌గా.. తాజాగా మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ టీడీపీని ఓడించే దిశ‌గా అధికార వైసీపీ త‌న‌దైన శైలి వ్యూహాలు అమ‌లు చేసింది. కుప్పం మునిసిపాలిటీపై త‌మ జెండాను ఎగుర‌వేసి చంద్ర‌బాబుకు షాకివ్వాల‌ని కూడా వైసీపీ వ్యూహ ర‌చ‌న చేసింది. అయితే పంచాయ‌తీ, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైనా.. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌మ స్త‌తా చాటేందుకు టీడీపీ కూడా త‌మ‌దైన శైలి వ్యూహాల‌ను అమ‌లు చేసింది. వెర‌సి ఇటు వైసీపీ, అటు టీడీపీ వ్యూహాల‌తో కుప్పం మునిసిప‌ల్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయ‌నే చెప్పాలి. ఫ‌లితం ఎవ‌రివైపు అన్న విష‌యంపై పోలింగ్‌కు ముందే పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు కూడా వినిపించాయి.

అధికార వైసీపీ త‌న‌దైన మార్కు బ‌లంతో ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోంద‌ని టీడీపీ ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేసింది. అనుకున్న‌ట్లుగానే పోలింగ్‌లో వైసీపీ దొంగ ఓట్ల‌ను ఆశ్ర‌యించి భారీ ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని కూడా టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. ప‌లు పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు వేసేందుకు ఇత‌ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జ‌నాన్ని వైసీపీ త‌ర‌లించింద‌ని కూడా టీడీపీ ఆరోపణ‌లు చేసింది. అంతేకాకుండా ప‌లు ప్రాంతాల్లో దొంగ ఓట్లు వేసేందుకు వ‌చ్చారంటూ ప‌లువురు వ్య‌క్తుల‌ను కూడా టీడీపీ శ్రేణులు ప‌ట్టుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. అయితే పోలింగ్ ముగిసిన త‌ర్వాత రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కుప్పం మునిసిప‌ల్ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయ‌ని, పోలింగ్ కేంద్రాల బ‌య‌ట చెదురుముదురు ఘ‌ట‌న‌లు మినహా పెద్ద గొడ‌వ‌లేమీ జ‌ర‌గ‌లేద‌ని,పోలింగ్  మొత్తం ప్ర‌శాంతంగా ముగిసింద‌ని ఆమె ప్ర‌కటించారు.

కుప్పం పోలింగ్‌కు సంబంధించి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో నీలం సాహ్ని ఏమ‌న్నారంటే.. ''కుప్పంలో మున్సిపల్ పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాలు ఉన్నాయని.. పోలింగ్ మొత్తాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించాం. చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా కుప్పంలో మకాం వేసి పరిస్థితుల్ని సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల బయట జరిగిన చిన్న చిన్న ఘటనలు మినహా అంతా ప్రశాంతమే. రీపోలింగ్ కోసం ఎక్కడా విజ్ఞప్తులు రాలేదు. దొంగ ఓటర్లపై ఏ నివేదిక రాలేదు. దీంతో ఏ ఒక్క చోట రీపోలింగ్ నిర్వ‌హించ‌డం లేదు. పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసిన నేప‌థ్యంలో కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను కూడా అత్యంత పార‌దర్శ‌కంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం'' అని ఆమె ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.