Begin typing your search above and press return to search.

‘యూపీ’పై ఇండియా టుడే మాట ఇదే..

By:  Tupaki Desk   |   5 Jan 2017 5:09 AM GMT
‘యూపీ’పై ఇండియా టుడే మాట ఇదే..
X
యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ జారీ చేయటం తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీ అధికారపీఠాన్ని చేజిక్కించుకునే వారు.. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయటం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో అయినా.. యూపీ పీఠాన్నిఈసారి తాము దక్కించుకోవాలని కమలనాథులు తహతహలాడుతున్నారు.

ఇదిలా ఉంటే.. యూపీ పీఠం ఎవరికి దక్కే అవకాశం ఉందన్నఅంశంపై మీడియా సంస్థలు ఎవరికి వారు సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన ఆనంద్ బజార్ పత్రిక నిర్వహించిన సర్వే వివరాలు మొన్న (మంగళవారం) విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే తన సర్వే వివరాల్ని వెల్లడించింది.

గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ తాము నిర్వహించిన సర్వే వివరాల్ని వెల్లడించిన ఈ మీడియా సంస్థ అంచనా ప్రకారం.. పెద్ద నోట్ల రద్దు ప్రభావం బీజేపీ మీద లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మీడియా సంస్థ సర్వే ప్రకారం.. యూపీ అధికారపీఠాన్ని బీజేపీ చేజిక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. నోట్ల రద్దుకు ముందు బీజేపీ పట్ల సానుకూలత 31 శాతం ఉండగా.. డిసెంబరు నాటికి 33 శాతానికి పెరగటం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉండగా.. బీజేపీకి 206 నుంచి 216 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. అధికార సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో నిలవగా.. మాయవతి నేతృత్వంలోని బీఎస్పీ మూడో స్థానంలో నిలవొచ్చని వెల్లడించింది. 27 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఎన్నికల్లో తీవ్ర నిరాశ ఎదురుకావటమే కాదు.. సింగిల్ డిజిట్ స్థానాల్ని దాటే అవకాశం ఉండదని చెబుతోంది. ఆనంద్ బజార్ పత్రిక నిర్వహించిన సర్వే మాత్రం.. బీజేపీ అధిక స్థానాల్ని చేజిక్కించుకుంటుదని పేర్కొంది. ఒకవేళ ఎస్పీలో చీలిక లేకుంటే.. ఆ పార్టీకే అత్యధిక సీట్లు వచ్చే వీలుందని వెల్లడించటం గమనార్హం.

ఇక.. పంజాబ్ లో అధికార శిరోమణి అకాలీదళ్ – బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకుంటుందని.. కానీ.. అధికారాన్ని చేపట్టటానికి అవసరమైన స్థానాలు సొంతం చేసుకోలేదన్న అభిప్రాయాన్ని ఎబీపీ వెల్లడించింది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు అధికారపక్షం వైపు తాము ఉన్నట్లు చెప్పినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను సాధించేవిషయంలో వెనుకబడి ఉంటుందన్న అభిప్రాయాన్ని తన సర్వేలో పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/