Begin typing your search above and press return to search.

సుప్రీం తీర్పుపై పోల్.. చానెల్ సర్వే దుమారం

By:  Tupaki Desk   |   9 Nov 2019 10:18 AM GMT
సుప్రీం తీర్పుపై పోల్.. చానెల్ సర్వే దుమారం
X
ప్రపంచం లోనే భిన్నమైన సంస్కృతులు.. విభిన్న మతాలు, ఎన్నో మతాలకు పుట్టినిల్లు మన దేశం.. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం.. అలాంటి ప్రశాంత భారత దేశంలో సర్వమత సహనం పాటి స్తారందరూ.. ముఖ్యంగా అనాధిగా దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం దిశగా సుప్రీం కోర్టు అడుగులు వేస్తే సర్వోన్నత న్యాయస్థానాన్ని సైతం కించపరిచేలా సర్వేలు పెడుతున్నాయి కొన్ని మీడియా సంస్థలు.

దశాబ్ధాలుగా హిందూముస్లింల మధ్య వివాదానికి కారణమై.. మతకల్లోలాలకు దారితీసి వందలాది మంది చనిపోయిన సీరియస్ ఇష్యూపై తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దేశ చరిత్ర లోనే ఇదో చారిత్రక తీర్పు. సుప్రీం కోర్టే మన దేశం లో అత్యున్నత నిర్ణయాధికారి.. సుప్రీంను మించిన న్యాయ వ్యవస్థ లేదు. అది చెప్పిందే వేదం. దాన్ని భారత దేశంలోని పౌరులంతా పాటించాలి. కానీ ఆ చిన్న విషయం కూడా కొంతమందికి తెలియక పోవడమే బాధకారం.. పైగా తెలుగులోని ఓ అగ్ర మీడియా సంస్థ ఇలా వ్యవహరించడం వివాదాస్పదమైంది.

సుప్రీం కోర్టు తాజాగా అయోధ్య వివాదం పై తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్ కు.. ఇక వేరే చోట 5 ఎకరాలను బాబ్రీ మసీదు కట్టేందుకు ముస్లిం సంఘాలకు అందజేయాలని తీర్పునిచ్చింది. హిందువుల మత విశ్వాసాలకు అనుగుణంగా వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి ఓకే చెప్పింది. హిందూ-ముస్లింల మత విశ్వాసాలకు ప్రతీక అయిన ఈ తీర్పును అందరూ స్వాగతిస్తూ సోషల్ మీడియా, మీడియా లో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం లేదు. చాలా మందిని సంయమనం పాటించాలని.. లేదంటే కేసులు తప్పవని పోలీసులు ముందే హెచ్చరించారు కూడా. అందుకే ఈ తీర్పుపై సోషల్ మీడియా లోనూ ఎవరూ నోరుపారేసుకోవడం లేదు.

అయితే తెలుగు లో దమ్మున్న చానెల్ గా పేరు ప్రకటించిన సంస్థ మాత్రం ఈ వివాదాస్పద అంశంపై పోల్ పెట్టి అభాసుపాలైంది. సదురు మీడియా సంస్థ తన సోషల్ మీడియా లో ఖాతాలో ‘అయోధ్య పై సుప్రీం కోర్టు తీర్పును మీరు సమ్మతిస్తారా?’ అని పోల్ పెట్టడం దుమారం రేపింది. దీనిపై నెటిజన్లు అందరూ భగ్గుమన్నారు. వివాదాస్పద అంశంపై పోల్ పెట్టడం ఏంటని సదురు చానెల్ ను ప్రశ్నించారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో హైదరాబాద్ సిటీ పోలీసులు వెంటనే ఆ పోస్టు తొలగించండి అని హెచ్చరించారు. దీంతో ఓ గంట తర్వాత పోల్ ను తొలగించారు.

నిజానికి సుప్రీం కోర్టు మన దేశంలో సుప్రీం. దాని తీర్పులను అందరూ శిరసా వహించాలి. కానీ సుప్రీం తీర్పునే ప్రశ్నించేలా ధిక్కరించేలా సదురు చానెల్ పోల్ పెట్టడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సున్నితమైన అంశాలను రెచ్చగొట్టేలా పోస్టు పెట్టడం కరెక్ట్ కాదంటూ విమర్శిస్తున్నారు. ఇది ఖచ్చితంగా కోర్టు దిక్కరణ కిందకు వస్తుందని సదురు చానెల్ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.