Begin typing your search above and press return to search.

'పద్మ' పురస్కారాల్లో కూడా రాజకీయమేనా ?

By:  Tupaki Desk   |   26 Jan 2022 6:30 AM GMT
పద్మ  పురస్కారాల్లో  కూడా రాజకీయమేనా ?
X
తాజాగా రాష్ట్రపతి ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల్లో కొన్ని ఆశ్చర్యంగా ఉన్నాయి. చాలా కాలంగా పద్మ అవార్డులు వివాదాస్పదమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వారికి కావలసిన వారికి అర్హతలతో సంబంధం లేకపోయినా, వివిధ కేసుల్లో ఉన్నవారికి కూడా ఈ అత్యున్నత పురస్కారాలను ఇచ్చేస్తున్నారు. దేశంలోనే అత్యున్నత ప్రతిష్టాత్మకమైన 128 పద్మ పురస్కారాల జాబితాను రాష్ట్రపతి భవన్ మంగళవారం జారీ చేసింది.

ఈ పురస్కారాల్లో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలున్న విషయం తెలిసిందే. తాజాగా వివిధ రంగాల్లో ప్రతిష్టులైన వారిలో 4గురికి పద్మవిభూషణ్, 17మందికి పద్మభూషణ్ తో పాటు 107 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. 128 మందిలో ఎవరి విషయం ఎలాగున్నా కొందరి పేర్లుచూసి జనాలందరు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వారిలో పబ్లిక్ అఫైర్స్ రంగం (రాజకీయాలు ?) లో మాజీ ముఖ్మమంత్రి కల్యాణ్ సింగ్ కు పద్మ విభూషణ్ పేరుంది.

అలాగే పద్మభూషణ్ పురస్కార గ్రహీతల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్, కల్యాణ్ సింగ్ ఫక్తు రాజకీయ నేతలు. వీళ్ళు సమాజానికి చేసిన సేవలు ఏమిటో కేంద్రానికే తెలియాలి. యూపీలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కల్యాణ్ సింగే సీఎంగా ఉన్నారు. మసీదు కూల్చివేత తర్వాతే దేశంలో బీజేపీ పుంజుకున్నది. ఇదే వివాదంలో తర్వాత కళ్యాణ్ విచారణను కూడా ఎదుర్కొన్నారు.

సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కూడా పద్మభూషణ్ అందుకోబోతున్నారు. అమెరికాలో ఉంటున్న వీళ్ళిద్దరు కూడా పూర్తిగా వ్యాపారస్తులే అనటంలో సందేహం లేదు. నిజానికి పద్మ పురస్కారాలు నిస్వార్ధంగా ఒక రంగంలో కానీ సమాజానికి కానీ సేవచేసిన వారికి ఇవ్వాల్సినవి. అలాంటిది రాజకీయ నేతలకు, వ్యాపారస్తులకు ఇవ్వడం వల్ల వ్యక్తిగతంగా వాళ్ళకు ఏమి ఉపయోగమో తెలీదు కానీ పురస్కారాల స్ధాయి మాత్రం తగ్గిపోవటం ఖాయం. అందుకనే ఈ మధ్య పద్మ పురస్కారాలు బాగా వివాదాస్పదమవుతున్నాయి.