Begin typing your search above and press return to search.

రాత్రికే రాత్రే పార్టీలు ఏం మార్చావు తల్లీ..

By:  Tupaki Desk   |   11 Feb 2020 9:30 AM GMT
రాత్రికే రాత్రే పార్టీలు ఏం మార్చావు తల్లీ..
X
రాజకీయాలు అంటే రోజుకో మలుపు తిరుగుతుంటాయి. దీనికి దేశ రాజకీయాలైనా గల్లీ రాజకీయాలైనా తేడా ఏమీ లేదు. అధికారమే పరమావధిగా రాజకీయాలు మారుతుంటాయి. దీనికి ఏ పార్టీ అతీతం కాదు. తాజాగా తెలంగాణలో ఓ మహిళ ఏకంగా మూడు పార్టీలు మారి సంచలనం సృష్టించింది. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె సహకార ఎన్నికల్లో ఓ పార్టీ తరఫున గెలిచి అనంతరం మరో పార్టీలోకి జంపయ్యారు. ఈ పరిణామం మల్కాజిగిరి జిల్లాలోని ఘట్ కేసర్ లో జరిగింది.

మల్కాజిగిరి జిల్లాలోని ఘట్ కేసర్ మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్రవంతి కృష్ణారెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు నంబర్ 3లో పోటీ చేసి విజయం కోసం తీవ్రంగా శ్రమించినా పరాజయం పొందారు. దీంతో తన రాజకీయ భవిష్యత్ కోసం కొన్ని రోజులకు బీజేపీలో చేరారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వారం రోజులకే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఎన్నికలు వచ్చాయి. బీజేపీలో ఉన్న ఆమె పరపతి సంఘం డైరెక్టర్ స్థానానికి పోటీ పడ్డారు. బీజేపీ మద్దతుతో పోటీ చేశారు. అయితే పోటీలో మరికొందరు ఉండడంతో ఆ అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకునేలా పార్టీ నాయకత్వంతో పాటు ఆమె తీవ్రంగా కృషి చేశారు. ఈ ప్రయత్నాలు ఫలించి అందరూ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఆమె ఒక్కరే పోటీలో ఉన్నారు. దీంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో ఆదివారం ఆమె డైరెక్టర్ గా ఎన్నికైనట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆమె రాత్రికి రాత్రి చేసిన పనే ఆశ్చర్యానికి గురి చేసింది.

బీజేపీ మద్దతుదారుగా ఉన్న ఆమె రాత్రిలోపు టీఆర్ ఎస్ లో చేరిపోయారు. రాత్రి కార్మిక మంత్రి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నివాసంలో ప్రత్యక్షమయ్యారు. గులాబీ కండువా కప్పేసుకుని కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. ఇలా గెలిచారో లేదో అలా పార్టీ మారిపోయారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ లో చేరిన అనంతరం ఆమె మాట్లాడిన మాటలు వింటే షాక్కవ్వాల్సిందే.

‘నా చివరి శ్వాస వరకు టీఆర్ఎస్ లోనే ఉంటా’ అని ఈ సందర్భంగా మీడియాతో స్రవంతిరెడ్డి తెలపడంతో అక్కడి వారంతా బాగుందమ్మా నీ మాటలు పేర్కొన్నారు. 15 రోజుల్లోపే మూడు పార్టీలు మార్చిన గొప్ప తల్లీవే నీవు.. అని చెబుతున్నారు.