Begin typing your search above and press return to search.

ప్రజలు కారు కింద పడతారా? ఏనుగు ఎక్కి వెళతారా?

By:  Tupaki Desk   |   9 Aug 2021 3:58 AM GMT
ప్రజలు కారు కింద పడతారా? ఏనుగు ఎక్కి వెళతారా?
X
తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న రాజకీయ పార్టీల పరంపరలో మరో పార్టీ ఫుల్ రీఛార్జి అయ్యింది. సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఇటీవల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అందరిని విస్మయానికి గురి చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మాయవతి అధినేత్రిగా ఉన్న బహుజన సమాజ్ వాదీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా నల్గొండలో ‘రాజ్యాధికార సంకల్ప సభ’ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త తరహాగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను సూటిగా విమర్శలు చేసిన ఆయన.. ఒక్క మాటలతో ప్రజలకు తానేం చెప్పాలనుకున్ననాన్న విషయాన్ని క్లియర్ గా చెప్పేశారు.

‘ప్రజలు కారు కింద పడతారా? ఏనుగు ఎక్కి వెళ్తారా తేల్చుకోవాలి’ అని తేల్చేశారు. రిజర్వేషన్లు మన హక్కు అని.. పాలకులు పెట్టే భిక్ష కాదన్న ఆయన.. మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే..

- రాష్ట్రంలో ప్రజల్ని మభ్య పెట్టేందుకు పిట్టకథలు చెప్పే వారంతా ఏం చేస్తున్నారో తెలుసు. యాసలో మాట్లాడుతూ వాసాలు లెక్క పెడుతున్నారు. గత 70 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలను పాలించిన 11 మందిలో 10 మంది అధిపత్య కులాలకు చెందిన వారే. మాకు పాలన చేతకాదనా? మీరే అపరమేధావులా? మీరే 60వేల పుస్తకాలు చదువుతారా? మాకు చదువు రాదనుకుంటున్నారా? జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా ఇవ్వాలి. లేకుంటే గుంజుకుంటాం.

- బిడ్డా ఉద్యోగం ఎందుకు వదిలేశావు అని మా అమ్మ అడిగింది. లక్షలాది మంది బిడ్డల బతుకు మార్చాలంటే.. త్యాగం చేయాల్సిన అవసరం ఉందని చెప్పాను. 17 ఏళ్లపోలీసు జీవితాన్ని వదులుకొని 2012లో గురుకులాల సొసైటీకి వచ్చాను. తొమ్మిదేళ్లలో ఏన్నో గొప్పనులు చేశా. ఒక గిరిజన బిడ్డ ఎవరెస్టు ఎక్కి.. అక్కడ అంబేడ్కర్ బొమ్మను పెట్టింది.

- గురుకులాల్లోని పిల్లలు ఇంగ్లిషులో మాట్లాడుతున్నారు. వీళ్లకేం చేతనైతది అన్న వారే ముక్కు మీద వేలు వేసుకునేలా చేశాను. ఇంజినీరింగ్.. మెడిసిన్ చదివేలా ప్రోత్సహించా. కరోనా సమయంలో పాఠశాలలు మూసేశారు. ఒక ఇంజినీరింగ్ కళాశాలను మాట్లాడుకొని అక్కడే ఉండి పిల్లలు చదువుకుంటుంటే సమాచారం ఎవరిచ్చారో తెలియదు కానీ.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధికారులు వచ్చి పిల్లలు రాత్రికి రాత్రి ఇంటికి వెళ్లేలా చేశారు.

- నేను పిల్లల హక్కులు హరించేస్తున్నానంట. ఏపీ ఎంపీ రఘురామ క్రష్ణ రాజు పార్లమెంటు సాక్షిగా అసత్య ఆరోపణలు చేశారు. మా బిడ్డలు చదువుకుంటే మీ కళ్లకు మంట. మేం జీవితాంతం గొర్లు.. బర్లు కాయాలా? కల్లుగీత కార్మికులుగా బతకాలా? ఎప్పుడు ఇంజినీర్లు.. వ్యోమగాములయ్యేది?

- అయ్యా సీఎం. మీరు ఖర్చు పెడతానన్న రూ.వెయ్యి కోట్లు వెవరివి? బడుగుజీవుల శ్రమ కాదా? వాటిని ఎందుకు విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు? మా మీద ప్రేమ ఉంటే.. మీ ఆస్తులు అమ్మి పెట్టండి. మా బతుకులు బాగుపడాలంటే అత్యున్నత ప్రమాణాలున్న విద్య.. వైద్యం.. ఉపాధి కావాలి. ప్రభుత్వ పాఠశాలల్ని.. విశ్వవిద్యాలయాల్ని పట్టించుకునే నాథుడే లేడు. నియామకాల్లేవు.

- రాష్ట్రంలో 50 వేల పోస్టులు ఉన్నాయంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ ఉద్యోగాలంటూ వార్తలు వస్తున్నాయి. కానీ.. ఉద్యోగాల ప్రకటనలు రావటం లేదు. అధికారంలోకి వచ్చినంతనే ఉస్మానియాలాంటి 5-10 ఆసుపత్రులు వస్తాయన్నారు. కరనా సమయంలో అవి ఎక్కడికి పోయాయి.

- హైటెక్ సిటీ.. టీహబ్.. పారిశ్రామిక పార్కుల్లో ఎంతమంది బహుజన బిడ్డలు ఉన్నారు. సంపద కేవలం ఐదు శాతం మంది వద్ద ఉంటే.. 95 శాతం మంది పేదరికంలో ఉన్నారు. ఈ దేశంలో 46 మందికి భారతరత్న ఇస్తే ఒక్కరే ఓబీసీ. ఎస్టీలు లేరు. ఎస్సీలు ఇద్దరే ఉన్నారు. దేశంలోని 119 బిలియనీర్లలో ఒక్క ఎస్సీ.. ఎస్టీ లేరు. ఇద్దరు బీసీలు ఉన్నారు.