Begin typing your search above and press return to search.

తాడిప‌త్రి హ‌వా.. జేసీదేనా? పెద్దారెడ్డి చిన్న బోతున్నారా?

By:  Tupaki Desk   |   27 Aug 2021 10:30 AM GMT
తాడిప‌త్రి హ‌వా.. జేసీదేనా?  పెద్దారెడ్డి చిన్న బోతున్నారా?
X
అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 8 ఎన్నిక‌ల నుం చి అంటే.. 40 ఏళ్లుగా జేసీ దివాక‌ర్‌, ప్ర‌భాక‌ర్ ఆధిప‌త్య‌మే సాగుతోంది. అయితే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ పెద్దారెడ్డి తొలిసారి.. సంచ‌ల‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి పెద్దారెడ్డి వ‌ర్సెస్ జేసీ వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో రాజ‌కీయ వివాదాలు కొన‌సాగుతున్నాయి. జేసీ ఇంటికి నేరుగా వెళ్లిన పెద్దారెడ్డివార్నింగులు ఇవ్వ‌డం.. ర‌చ్చ చేయ‌డం అంద‌రికీ తెలిసిందే. అయితే.. అనూ హ్యంగా ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో తాడిప‌త్రి మునిసిపాలిటీని.. టీడీపీ నేత‌గా ఉన్న జేసీ వ‌ర్గం ద‌క్కించుకుంది.

టీడీపీకి 18, వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. ఒకరు సీపీఐ నుంచి, మరొకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వారిద్దరూ టీడీపీకే మద్దతు ఇచ్చారు. దీంతో టీడీపీ బలం 20కి పెరిగింది. వైసీపీకి ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ బలం 18కి చేరింది. వాస్త‌వానికి మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని వైసీపీ ద‌క్కించుకుంటుంద‌ని.. ఓ ఇద్ద‌రిని లాగేస్తే.. టీడీపీ బ‌లం త‌గ్గిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇక‌, స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా.. భారీ ఎత్తున జేసీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తామే ఈ మునిసిపాలిటీని ద‌క్కించుకుంటామ‌న్నారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ర‌గ‌డ త‌ప్ప‌ద‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, ఏం జ‌రిగిందో ఏమో.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. నుంచి వ‌చ్చిన సందేశంతో ఎమ‌మ్మెల్యే పెద్దారెడ్డి సైలెంట్ అయ్యారు. దీంతో జేసీ వ‌ర్గానికి ఇక్క‌డ రెడ్ కార్పెట్ ప‌రిచిన‌ట్ట‌యింది. ఫ‌లితంగా జేసీ ప్ర‌భాక‌ర్ తాడిప‌త్రి మునిసిపాలిటీకి.. చైర్మ‌న్‌గా ఆయ‌న అనుచ‌రుడే వైస్ చైర్మ‌న్‌గా ఎన్నిక‌య్యారు. ఇక‌, అప్ప‌టి నుంచి పెద్దారెడ్డి వ‌ర్సెస్ జేసీల మ‌ధ్య పెద్ద‌గా ఎలాంటి వివాదాలు తెర‌మీదికి రాలేదు. అయితే.. తాజాగా ఇప్పుడు.. ఇద్ద‌రు.. కో ఆఫ్ష‌న్ స‌భ్యుల ఎన్నిక విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. ఇద్దరు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు.

అయితే.. ఈ ప‌ద‌వుల‌ను త‌న వ‌ర్గానికి ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యూహం సిద్ధం చేసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్రమంలో తమ కౌన్సిలర్లను జేసీ ప్రభాకర్‌రెడ్డి వేరే చోట‌కు త‌ర‌లించారు. అయితే.. పెద్దారెడ్డి వ‌ర్గం .. దూకుడుగా ఉంటుంద‌ని అనుకున్నా.. ఎక్క‌డా చ‌డీ చ‌ప్పుడు చేయడం లేదు. దీంతో జేసీ మద్దతుదారులకే ఆ రెండు పోస్టులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌లేమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.