Begin typing your search above and press return to search.

ఎవరో ఫోటోనూ మూడు పార్టీలు భలేగా వాడేశాయిగా?

By:  Tupaki Desk   |   19 May 2020 9:00 PM IST
ఎవరో ఫోటోనూ మూడు పార్టీలు భలేగా వాడేశాయిగా?
X
పనికి.. ప్రచారానికి ఏ మాత్రం పొంతన లేకుండా సాగుతున్న వైనం ఒకటి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన కార్యకర్త ఒకరు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసుకున్న ఫోటోను.. తమకు అనువుగా మార్చేసుకొని మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వారు తమ ప్రచారానికి అనుగుణంగా వాడేసిన తీరు చూస్తే.. అవాక్కు అవ్వాల్సింది. సొమ్ము ఒకడిది.. సోకు మరొకడిదన్నట్లుగా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. సోషల్ మీడియా రాజ్యంలో వాస్తవాలు ఎలాంటి వక్రీకరణకు గురవుతాయన్నది ఇట్టే అర్థమై పోతుంది.

హైదరాబాద్ నుంచి వేలాది మంది వలస కూలీలు తమ సొంతూళ్లు వెళ్లేందుకు కాలి నడకన వెళుతున్న వైనం తెలిసిందే. ఇలా వెళ్లే వారి కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారికి అవసరమైన సాయాన్ని అందిస్తున్నాయి. ఇందులో భాగంగా మేడ్చల్ రింగు రోడ్డు దగ్గర ఒక శిబిరంలో ఒక చిన్నారి నవ్వుతూ భోజనం చేస్తున్న ఫోటోను ఆ సంస్థకు చెందిన కార్యకర్త క్లిక్ మనిపించారు. దాన్ని ఆమె.. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసుకున్నారు.

‘‘ఆ నవ్వే మాకు స్ఫూర్తి’’ అని సదరు కార్యకర్త వ్యాఖ్యతో చేసిన ఫోటో చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయ్యింది. చూసినంతనే అకట్టుకునే ఈ ఫోటోను టీఆర్ఎస్ అభిమాని ఒకరు.. ‘‘ఆ చిరునవ్వుకు ఏమి ఇచ్చినా తక్కువే. మేడ్చల్ టోల్ గేట్ దగ్గర తెలంగాణప్రభుత్వం వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో సీన్. హ్యాట్సాఫ్ కేసీఆర్ సార్’’ అంటూ ఆ ఫోటోను తనకు అనుగుణంగా మార్చేసి పోస్టు చేసుకున్నాడు.

ఇదే ఫోటోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమాని ఒకరు.. ‘‘హమ్మయ్య దారిన వెళుతూ ఏపీ గవర్నమెంటు పుణ్యమా అని బిడ్డలు కడుపు నిండా తింటున్నారు. కాళ్లకు చెప్పులు కూడా ఇచ్చారు’’ అని మరింతగా మార్చేసి సోషల్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ రెండు స్క్రీన్ షాట్లను జత చేసిన బీజేపీ అభిమాని ఒకరు మరో అడుగు ముందుకు వేసి.. ‘‘ఒకే ఫోటోకి రెండుపార్టీల ప్రచారం. అక్కడ వలస కూలీల సంక్షేమం కోసం డబ్బు ఇచ్చింది కేంద్రం.

తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకునేది లోకల్ పార్టీలు. తిరిగి వలస కూలీలను కేంద్రం పట్టించుకోవటం లేదంటూ బురద జల్లే ప్రయత్నం. ఇవే రాజకీయాలు’’ అని తన సోషల్ ఖాతాలో పోస్టు చేశారు. అసలు.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని ఒక స్వచ్ఛంద సంస్థ చేసే సాయాన్ని.. ఎవరికి వారు తమదిగా క్లెయిం చేసుకునే తీరు చూస్తే.. ఏ మాత్రం మొహమాటం లేకుండా వాడేసే తీరుకు అవాక్కు అవ్వాల్సిందే. ఒకే ఫోటోను ఎవరికి వారుగా వాడేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.