Begin typing your search above and press return to search.

పార్టీల్ని 'ఫుట్ బాల్' ఆడేసిన సీఈసీ

By:  Tupaki Desk   |   3 March 2019 5:01 AM GMT
పార్టీల్ని ఫుట్ బాల్ ఆడేసిన సీఈసీ
X
ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే చాలు.. ఈవీఎంల మీద వినిపించే విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు అన్ని ఇన్ని కావు. ఈవీఎంలు ఎంత మాత్రం స‌రైన‌వి కావంటూ ఆరోప‌ణ‌లు చేసే వారికి త‌క్కువ లేదు. ఈవీఎంలు న‌మ్మ‌ద‌గిన‌వి కావ‌ని.. ఒక‌వేళ వాటిని ట్యాంప‌ర్ చేసే అవ‌కాశ‌మే లేకుంటే అభివృద్ధి చెందిన దేశాల్లోనూ నేటికి బ్యాలెట్ విధానాన్ని ఎందుకు అమ‌లు చేస్తున్నారంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తుంటారు.

ఇలాంటి వాద‌న‌ల్ని వినిపించే రాజ‌కీయ నేత‌ల‌కు త‌గ్గ‌ట్లే.. ప‌లువురు సాంకేతిక నిపుణులు త‌మ వాద‌న‌ను వినిపిస్తూ.. ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేయ‌టం పెద్ద విష‌య‌మే కాదంటూ ప్ర‌యోగాత్మ‌కంగా చూపించే ప‌రిస్థితి. ఇలా విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌ల న‌డుమ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగియటం.. గెలిచిన వారు సంబ‌రాల్లో మునిగిపోతే.. ఓడిన వారు మాత్రం తమ ఓట‌మికి ఈవీఎంలు కార‌ణ‌మంటూ బుర‌ద జ‌ల్లే ప‌రిస్థితి.

ఈ మొత్తం ఎపిసోడ్‌ లో ప్ర‌తిసారీ విమ‌ర్శ‌కుల‌ వేళ్లు ఎన్నిక‌ల క‌మిష‌న్ మీద వేలెత్తి చూపిస్తూ ఉంటాయి. మ‌రి.. ఈ విష‌యం గుర్తుకు వ‌చ్చిందో.. లేక త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు గంట మోగనున్న వేళ‌.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారి సునీల్ ఆరోరా రాజ‌కీయ పార్టీల‌ను ఉద్దేశించి ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రాజ‌కీయ పార్టీలు ఫుట్ బాల్ గా భావిస్తుంటాయ‌ని.. త‌మ‌కు ఇష్ట‌మైన రీతిలో వాటిని ఆడుకుంటున్నాయంటూ విమ‌ర్శించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా రాక‌పోతే అవి స‌రిగా ప‌ని చేయ‌టం లేదంటూ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న‌ట్లు చెప్పారు. రెండు ద‌శాబ్దాలుగా ఈవీఎంల‌ను వినియోగిస్తున్న పార్టీలు తాము చేస్తున్న విమ‌ర్శ‌లను ఒక్క‌సారి చూసుకోవాల‌ని.. సుదీర్ఘ‌కాలంగా వినియోగిస్తున్న ఈవీఎంల‌పై విమ‌ర్శ‌ల్ని ఆపాల‌న్న భావ‌న ఆయ‌న మాట‌ల్లో వినిపిస్తోంది. మొత్తానికి ఫుట్ బాల్ పోలిక తీసుకొచ్చి.. త‌న ఘాటు విమ‌ర్శ‌తో రాజ‌కీయ పార్టీల‌ను టోకుగా సీఈసీ ఫుట్ బాల్ ఆడేసిన‌ట్లుగా లేదు..?