Begin typing your search above and press return to search.

అన్నీ పార్టీల్లోను అయోమయమేనా ?

By:  Tupaki Desk   |   30 Jan 2022 4:31 AM GMT
అన్నీ పార్టీల్లోను అయోమయమేనా ?
X
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల్లో అయోమయం పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే అన్ని పార్టీలు కూడా జాట్ సామాజికవర్గానికి పెద్దగా టికెట్లు ఇవ్వలేదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో జాట్ల ప్రాబల్యం చాలా ఎక్కువ. పశ్చిమ యూపీలో 128 సీట్లున్నాయి. ఈ సీట్లలో జాట్లు + ముస్లింలు గట్టిగా అనుకుంటే ఫలితాన్ని ఏకపక్షం చేయగలరు. ఇంతటి కీలకమైన ప్రాంతంలో మామూలుగా అయితే జాట్లు, ముస్లింలకే అన్నీ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలి.

కానీ పార్టీలకు ఏమైందో ఏమో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీ, బీఎస్పీలు జాట్లకు పెద్దగా సీట్లివ్వలేదు. ఎస్పీతో పొత్తులో ఉన్న ఆర్ఎల్డీ పార్టీ మాత్రమే జాట్ల పార్టి. అలాంటి పార్టీ వివిధ ప్రాంతాల్లో కలిపి కొన్ని సీట్లను జాట్లకు ఇచ్చుకున్నది. అంతేకానీ పశ్చిమ యూపీ అని ప్రత్యేకంగా టికెట్లేమీ ఇవ్వలేదు. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆర్ఎల్డీకి కేటాయించిందే 38 సీట్లు. ఇందులో రాష్ట్రం మొత్తం మీద సర్దాలి కాబట్టి ప్రత్యేకించి పశ్చిమ యూపీ అని చూడలేదు.

పశ్చిమ యూపీలో జాట్లకు మంచి ప్రాబల్యం ఉందని తెలిసి కూడా ఎస్పీ ఎందుకని ఎక్కువ సీట్లు కేటాయించలేదో అర్థం కావటం లేదు. మళ్ళీ ముస్లింలకు ఓబీసీలకు బాగానే కేటాయించింది. మరి దీని ప్రభావం పార్టీపైన ఎలాగుంటుందో ఏమో అర్థం కావటం లేదు. బీజేపీ జాట్లకు ఎక్కువ టికెట్లు ఇవ్వలేదంటే ఒకర్ధం ఉంది. ఏమిటంటే మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది జాట్ల నేత రాకేష్ తికాయత్ నేతృత్వంలోనే. జాట్లంటే బీజేపీపై మండిపోతున్నారు. మామూలుగా అయితే వాళ్ళ మంట తగ్గించేందుకు బీజేపీ ఎక్కువ సీట్లివ్వాలి. కానీ కమలం నేతలు కూడా ఆ పనిచేయలేదు.

ఇక బీఎస్పీ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు. ఎందుకంటే అసలు పార్టీ అధినేత్రి మాయావతే స్తబ్దుగా ఉన్నారు. టికెట్ల కేటాయింపులో మాత్రమే కాస్త చురుగ్గా ఉన్నారు. అది కూడా ఎస్సీలు, బ్రాహ్మణులు, ఓబీసీల టికెట్లపైనే మాయావతి ఎక్కువగా దృష్టి పెట్టారు. అందుకనే ప్రధాన పార్టీలేవీ ఎందుకనో జాట్లకు వాళ్ళ దామాషా ప్రకారం టికెట్లు కేటాయించలేదు. మరి ఈ పరిస్థితుల్లో జాట్లు ఏ పార్టీకి ఓట్లేస్తారో అర్థం కావటం లేదు. ఎస్పీయే తమకు ఎక్కువ టికెట్లిస్తుందని జాట్ నేతలనుకున్నారు. కానీ సీన్ రివర్సయ్యింది. అందుకనే ఇపుడు అన్ని పార్టీల్లోను జాట్ల ఓట్లపై అయోమయం పెరిగిపోతోంది.