Begin typing your search above and press return to search.

మీ చీఫ్ జస్టీస్ మాట విన్నావా పాక్!

By:  Tupaki Desk   |   20 Sep 2016 4:44 AM GMT
మీ చీఫ్ జస్టీస్ మాట విన్నావా పాక్!
X
పాకిస్థాన్ లో ఉగ్రవాదులు పుష్కలంగా ఉన్నారు.. పాకిస్థాన్ ఉగ్రవాదులకు సేఫ్ జోన్.. ఉగ్రవాదులంటే అది వేరే వ్యక్తులు కాదు - పాక్ అప్రకటిత సైన్యమే.. ఈ మాటలు నిత్యం వింటూనే ఉంటాం. ఇది కేవలం భారతదేశం చెప్పే మాటేకాదు - ప్రపంచ దేశాల్లో చాలా వాటి నుంచి వచ్చే మాటే ఇది. ఈ విమర్శలకు - మాటలకు బలం చేకూరుస్తూ పాక్ అప్పుడప్పుడూ భారత్ పై తమ కుక్కతోక వంకర బుద్దులు బయటపెట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఆ దేశంలోని తీవ్రవాదం పై పాకిస్తాన్ కు చెందిన చీఫ్ జస్టిస్ అన్వర్ జహీర్ జమాలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా యురి సెక్టార్ లో ఉగ్రవాదులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇది పూర్తిగా పాకిస్తాన్ పనే అని భారత్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై పాక్ స్పందిస్తూ.. సాక్ష్యాలు చూపించాలని, అలా ఆరోపణలు చేయడం మంచిది కాదని తెలిపింది. అయితే తాజాగా పాక్ చీఫ్ జస్టిస్ అన్వర్ జహీర్ జమాలీ... పాక్ లోని కొన్ని రాజకీయ పార్టీలు ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్నాయని అన్నారు. పాకిస్థాన్‌ లోని కొన్ని రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత రాజకీయ - ఆర్థిక ప్రయోజనాల కోసం ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. దీంతో న్యాయవ్యస్థపై సైతం తన ప్రభావాన్ని చూపించేందుకు, న్యాయవ్యవస్థనును చేతుల్లోకి తెచ్చుకునేందుకు జడ్జీలు - లాయర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో పాకిస్తాన్ అంతర్గత ప్రయోజనాల దృష్ట్యా ఉగ్రవాదం వృద్ధి చెందుతోందన్నారు.

తాజాగా భారత్‌ లోని యూరి సెక్టారులో నిద్రిస్తున్న భారత సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశం సుస్థిరంగా ఉండాలంటే ఉగ్రవాదంపైన ఆధారపడకుండా ప్రభుత్వ వ్యవస్థలు సక్రమంగా పని చేయాలని ఆయన హితవు పలకడంపై పాక్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా గుంటకాడ నక్కలా కాచుకుని - దొంగ దెబ్బలు తీయడానికి నిత్యం ప్రయత్నాలు చేసే పాక్ పై భారత్ ఆరోపణలు చేసిన ప్రతిసారీ, అది తమ చర్య కాదని పాక్ చెబుతూ వస్తుంది. ఈ విషయాలపై తాజాగా పాక్ చీఫ్ జస్టీస్ ప్రపంచ దేశాలతో పాటు భారత్ కు కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లయ్యింది.