Begin typing your search above and press return to search.

అధికారానికి నగరమే కీలకం!

By:  Tupaki Desk   |   24 Nov 2018 6:37 AM GMT
అధికారానికి నగరమే కీలకం!
X
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో రాష్ట్ర రాజధాని ఫలితాలే కీలకం కానున్నాయి. డిసెంబరు 11న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరో నగర ఫలితాలే నిర్ణయించనున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాలలోను తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దులు బలంగా ఉన్నారు. అయితే 20 నుంచి 25 మంది వరకూ జంపింగ్ ఎమ్మెల్యేల పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానాన్ని కలవర పెడుతోంది. ముఖ్యంగా నల్గొండ - వరంగల్ - ఖమ్మం జిల్లాలలో ఈ పరిస్దితి ఎక్కువగా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తెలంగాణ ప్రజలు వ్యతిరేకత చూపెడుతున్నారు. వారిది స్వ‌యంకృతాప‌రాధ‌మేన‌ని తెలుస్తోంది. అధికారంలో ఉన్న నాలుగున్నర సంవత్సరాలు వారు నియోజకవర్గాలను పట్టించుకోలేదని - కొందరైతే నియోజకవర్గాలకే రాలేదనే అపవాదు ఉంది. ఈ నియోజకవర్గాలను తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం నెల రోజుల ముందే గుర్తించింది. దీంతో ఈ నియోజకవర్గాలలో నష్టనివారణ చర్యలు తీసుకుంది. అయితే రాష్ట్ర రాజధానిలో వీలైనన్ని ఎక్కువ స్దానాలు దక్కించుకుంటే అధికారం ఖయమనే భావనలో ఉంది. ప్రత్యర్ది మహాకూటమి నేతలు కూడా రాష్ట్ర రాజధానిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ సెటిలర్ల ఓట్లు కీలకం కానున్నాయి.

రాష్ట్ర రాజధానిలో పాతబస్తీలోని ఎనిమిది స్థానాలు మజ్లిస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మిగిలిన స్థానాలలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. కూకట్‌ పల్లి - శేరిలింగంపల్లి - ఖైరాతాబాద్ - మల్కాజ్‌ గిరి ఉప్పల్ నియోజకవర్గాలలో సెటిలర్ల ఓట్లు అభ్యర్ది విజయాన్ని శాసిస్తాయి. అలాగే ఖైరాతాబాద్ జూబ్లీ హిల్స్ లో కూడా వీరి ప్రభావం చాలా ఉంటుంది. తెలంగాణ జిల్లాలలో మహాకూటమికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెరిసగం సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో అన్నది నిర్ణయించేది నగర ఓటర్లే అంటున్నారు. దీనిని గుర్తెరిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన ప్రచారాన్ని రాజధానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తమ అగ్ర నాయకులను రాజధానిలో మోహరించి విజయం కోసం వ్యూహరచన చేస్తోంది.

ఇక అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సెటిలర్ల మద్దతు లభిస్తుందని నమ్మకంగా ఉంది. దీనికి హైదారాబాద్ నగర పాలక సంస్దకు జరిగిన ఎన్నికలలో తాము సాధించిన విజయమే తార్కాణ‌మని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నారు. రాజధానిలో ఉద్యోగులు - విద్యావంతులు ఎక్కువగా ఉండడంతో వారంతా తమవైపే ఉంటారని తెలంగాణ జన సమితి నమ్మకంగా ఉంది. పైగా ఆంధ్ర‌లో బాబుపై ఉన్న వ్య‌తిరేక‌త ఇక్క‌డ కూడా టీఆర్ ఎస్‌ కు అనుకూలం కావ‌చ్చ‌ని అంటున్నారు. ఇలా అన్ని పార్టీలు నగరంలో పాగా వేసేందుకు పాచికలు సిద్దం చేసుకుంటున్నాయి. నగర ఓటరు ఎవరికి పట్టం కడతాడో వచ్చే నెల పదకొండు వరకూ వేచి చూడాల్సిందే.