Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో పాలి 'ట్రిక్స్' ఇక అంత ఈజీ కాదు

By:  Tupaki Desk   |   9 Dec 2018 1:30 AM GMT
సోషల్ మీడియాలో పాలి ట్రిక్స్ ఇక అంత ఈజీ కాదు
X
ఇండియా లో ఎన్నికలంటే డబ్బు ప్రవాహం అన్న సంగతి అందరికీ తెలిసిందే.. అందులోనూ తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు - అభ్యర్థుల ప్రచారానికి కొంత కాలంగా సోషల్ మీడియా కూడా వేదికవుతోంది. ఎన్నికల సంఘం నిబంధనలు ఎంత కఠినతరం చేసినా - ఎన్ని నియంత్రణలు అమల్లోకి తెచ్చినా సోషల్ మీడియా విషయంలో రాజకీయ పార్టీలు - నేతల ఆటలకు అడ్డుకట్ట వేయలేకపోతోంది. ముఖ్యంగా ఫేస్‌ బుక్‌ లో ప్రచారం - యూట్యూబ్‌ లో ఎలాంటి నియంత్రణల్లేని వీడియోలను కుమ్మరించడాన్ని అడ్డుకోలేకపోతోంది. అయితే... ఇకపై ఇలాంటి ఆటలు సాగే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికల సంఘం దీనిపై గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో రాజకీయ ప్రకటనలను నియంత్రించడానికి - ఆ ఖర్చులను ఎన్నికల వ్యయం లెక్కల్లోకి తేవడానికి చర్యలు చేపడుతోంది. లోక్ సభ ఎన్నికల నాటికి ఇవి అమల్లోకి వచ్చే అవకాశముంది. ఈ దిశగా భారత్ వరకు ఫేస్‌ బుక్‌ నియంత్రణలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది.

రాజకీయ పార్టీలు - నేతలకు సంబంధించిన ప్రకటనలను ఫేస్‌ బుక్‌ లో ఇచ్చేవారు వారి గుర్తింపు వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి ఫొటో - ఫొటో ఐడెంటిటీ కార్డులు - చిరునామా సమర్పించాల్సిన అవసరం వస్తుంది. ఇది కూడా ఏదో ఒకటి అప్‌ లోడ్ చేస్తే అయిపోయేలా ఉండదు... చిరునామాను ఫేస్‌ బుక్ ప్రతినిధులు స్వయంగా విజిట్ చేసి ధ్రువీకరించుకుంటారు.

దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ అంతా కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా పూర్తి చేయొచ్చు. అంటే ఫొటో - ఐడెంటిటీ కార్డు - చిరునామా అప్‌ లోడ్ చేయడం వంటివన్నీ ఆన్‌ లైన్ లోనే చేయొచ్చు. అయితే.. ఆ చిరునామాను తనిఖీ చేస్తారు. అంతేకాదు... ఒక వ్యక్తి లేదా సంస్థ పోస్ట్ చేసే యాడ్స్ అన్నీ ఎవరైనా ఒకే చోట చెక్ చేసేలా - ఒకే చోట కనుగొనేలా ఒక ఆన్‌ లైన్ లైబ్రరీ ఏర్పాటవుతుంది.

అంతేకాదు... ఆ యాడ్స్‌ కి ఎంత ఖర్చయింది.. ఎంతమంది చూశారు.. ఏఏ ప్రాంతాల్లో చూశారు వంటి వివరాలన్నీ అక్కడుంటాయి. అలాగే ప్రతి ప్రకటనపైనా ఫేస్ బుక్ ఒక డిస్‌ క్లెయిమర్ కూడా ఉంచుతుంది. అందులోనూ ప్రకటనకర్త వివరాలు ఉంటాయి. ఇండియా ఎన్నికల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా తాము ఇదంతా చేయబోతున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది.

ఇదంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈసీ కంటికి చిక్కకుండా సోషల్ మీడియాలో కోట్లు కుమ్మరించి ప్రచారం చేసుకునే అవకాశం తగ్గుతుంది. అంతేకాదు.. ఇన్‌ కం టాక్స్ కంటికీ చిక్కుతారు. సో... సోషల్ మీడియాలో పొలిటికల్ గేమ్స ఇక అంత ఈజీ కాదన్నమాట.