Begin typing your search above and press return to search.

తిరుమల్లో అడవుల్లో ఎర్రదొంగల అలజడి

By:  Tupaki Desk   |   20 Jun 2020 1:00 PM GMT
తిరుమల్లో అడవుల్లో ఎర్రదొంగల అలజడి
X
కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వేంకటేశ్వరుడు కొలువై ఉన్న శేషాచలం కొండల్లో మరోసారి దొంగలు పడ్డారు. అందినకాడికి విలువైన ఎర్రచందనం చెట్లను నరికేసి దోచుకుపోతున్నారని తెలిసింది. ఇన్నాళ్లు నిశబ్ధంగా ఉన్న శేషాచలం అడవుల్లో ఇప్పుడు ఎర్రదొంగలతో మళ్లీ అలజడి చెలరేగింది.

తాజాగా శేషాచలం అడవులు, శ్రీవారి మెట్టు, బాక్రాపేట ఘాట్, ఎర్రావారి పాలెంలో స్మగ్లర్లు సంచరిస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. కరోనా ఎఫెక్ట్ తో తిరుమల కొండల్లో జనసంచారం తగ్గడంతో ఇదే అదునుగా భావించిన ఎర్రచందనం దొంగలు వాకీటాకీలు, ఆయుధాలతో తిరుగుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని పట్టుకోవడానికి రెండు టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగినట్టు తెలిసింది.

మూడు నెలలుగా చప్పుడు లేకున్నా తిరుమల కొండల్లో తాజాగా ఎర్రదొంగల ఎంట్రీతో మరోసారి అలజడి చెలరేగింది. వారి కోసం శేషాచలం అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అడవిలో సగం కాలిన ఎర్రదుంగలను గమనించిన పోలీసులు సమీప ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

అర్ధరాత్రి సమయంలోనే స్మగ్లర్లు తమిళనాడు నుంచి శేషాచలం అడవుల్లోకి వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఒకచోట అడవి పందిని చంపి స్మగ్లర్లు కాల్చుకు తిన్నట్టు ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు.