Begin typing your search above and press return to search.

బెజ‌వాడ గ్యాంగ్‌ వార్‌ కు కార‌ణ‌మిదే: పోలీసుల వెల్ల‌డి

By:  Tupaki Desk   |   8 Jun 2020 1:00 PM GMT
బెజ‌వాడ గ్యాంగ్‌ వార్‌ కు కార‌ణ‌మిదే: పోలీసుల వెల్ల‌డి
X
బెజ‌వాడ‌లో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌ వార్‌ పై ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో రోజుకో విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. తాజాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే ఈ గ్యాంగ్ వార్‌ కు సంబంధించి విజయవాడ సిటీ కమిషనర్ ద్వారకా తిరమలరావు కీలక సమాచారం అందించిన విష‌యం తెలిసిందే. తాజాగా సోమవారం డీసీపీ హర్షవర్ధన్ మ‌రికొన్ని వివ‌రాలు తెలిపారు. మొత్తానికి ఈ ఘ‌ర్ష‌ణ‌కు కార‌ణం వివ‌రించారు. గ్యాంగ్ వార్‌కు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరు పరిచి మొత్తం సంఘ‌ట‌న వివ‌రించారు.

ఈ ఘ‌ర్ష‌ణ సెటిల్‌ మెంట్ విషయంలోనే చోటుచేసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు. సందీప్, - పండు వర్గాల మధ్య గొడ‌వ‌కు దారితీసి చివ‌ర‌కు సందీప్ మ‌ర‌ణానికి కార‌ణ‌మైంద‌ని తెలిపారు. ఈ గ్యాంగ్‌‌ వార్‌ లో ఇప్పటివరకు మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సందీప్ హత్యకు కారణమైన 13 మందిని, - పండుపై దాడి చేసిన 11 మందిని అరెస్ట్ చేసినట్లు చెచెప్పారు. అయితే ఈ గొడ‌వ‌కంత‌టికి కార‌ణం ఓ అపార్ట్‌ మెంట్ విషయంలో సెటిల్‌ మెంట్ జరిగింద‌ని పేర్కొన్నారు.

పండు - సందీప్ వర్గాలు కలుసుకున్నప్పుడు సందీప్ గ్యాంగ్ ముందు పండు కుర్చీలో నుంచి లేవక‌పోవ‌డ‌మే ఘ‌ర్ష‌ణ‌కు త‌క్ష‌ణ కార‌ణం. పిల్లోడివి మా ముందే కుర్చుంటావా అంటూ సందీప్ వర్గానికి చెందిన కిరణ్‌ కుమార్ కర్రతో పండును రెండుసార్లు కొట్టాడు. దీంతో ఒక్కసారిగా గొడవ జ‌రిగింది. ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకుని ఒక‌రి మ‌ర‌ణానికి కార‌ణంగా నిలిచింది. అయితే సెటిల్‌ మెంట్ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ సందీప్ పండు ఇంటికెళ్లి బెదిరించాడు, ఆ తర్వాత పండు కూడా సందీప్ షాప్ వద్దకు వెళ్లి హల్‌ చల్ చేశాడు. దీంతో వారి మ‌ధ్య విబేధాలు పెరిగి ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకునే వ‌ర‌కు చేరుకుంది. ఈ రెండు గ్యాంగు‌ల్లో మొత్తం క్రిమినల్సే ఉన్నారు. అందరికీ క్రిమినల్ హిస్టరీ ఉందని పేర్కొన్నారు.

అయితే మృతిచెందిన సందీప్ భార్య తేజ‌స్విని కొన్ని ఆరోప‌ణ‌లు చేయ‌గా వాటిని పోలీసులు కొట్టిపారేశారు. అవ‌న్నీ అవాస్త‌వాలు అని స్ప‌ష్టం చేశారు. త‌న భ‌ర్త సందీప్ హత్య వెనుక రాజకీయ నేతల హస్తం ఉందన్న మృతుడి భార్య తేజస్విని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. సందీప్ హత్య వెనుక ఎలాంటి రాజకీయ నాయకులు లేరని తేల్చి చెప్పారు. నిందితుల్లో ముగ్గురు మంగళగిరి నుంచి వచ్చారు. పండు తల్లికి క్రిమినల్ హిస్టరీ ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ విధంగా ఒక్క చిన్న కార‌ణం ఇంత పెద్ద దారుణానికి దారి తీసింది.