Begin typing your search above and press return to search.

దిశ కేసు పై పోలిసుల కీలక నిర్ణయం ..ఏంటంటే !

By:  Tupaki Desk   |   17 Dec 2019 5:19 AM GMT
దిశ కేసు పై పోలిసుల కీలక నిర్ణయం ..ఏంటంటే !
X
"దిశ" ఉదంతం గురించి అందరికి తెలిసిందే. ఈ ఉదంతం పై దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి .. తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నలుగురు పోలీస్‌ కాల్పుల్లో చనిపోయారు. దీనితో ఈ కేసుని ఇక ముందుకు తీసుకోవడం కష్టం కావడంతో దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలతో కోర్టులో రిపోర్టు దాఖలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే షాద్‌ నగర్‌ కోర్టులో రిపోర్టు దాఖలు చేసిన తరువాత కేసు క్లోజ్‌ చేసేందుకు కోర్టు అనుమతి కోరనున్నారని తెలుస్తుంది.

దిశ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కేసు తీవ్రత నేపథ్యంలో విచారణకు మహబూబ్‌నగర్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులను కస్టడీకి తీసుకొని సీన్‌ రీ కన్‌ స్ట్రక్షన్‌ కోసం తీసు కెళ్లగా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో దాడికి పాల్పడి ఎదురు కాల్పుల్లో ఆరీఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందారు. దిశ మిస్సింగ్‌ కేసు, కిడ్నాప్‌, అత్యాచారం, హత్యకు సంబంధించిన నలుగురు నిందితుల్ని ప్రాథమికంగా విచారించిన సమయంలోనే కీలక సమాచారం సేకరించారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రిమాండ్‌ రిపోర్టులో వివరాలను పొందుపర్చారు. అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు చనిపోవడంతో వారిపై చార్జెస్‌ ఫ్రేమ్‌ చేసే పరిస్థితి లేదు.

చార్జిషీట్‌ కాకుండా కోర్టులో కేసుకు సంబంధించి రిపోర్టు దాఖలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టు ఉనికిలోకి రాకపోవడంతో షాద్‌నగర్‌ కోర్టులోనే ఈ నెలాఖరు నాటికి రిపోర్టు దాఖలు చేయనున్నారు. ఫోరెన్సిక్‌, పోస్టుమార్టం నివేదికలు, సీసీ టీవీ ఫుటేజీ, ఘటన సమయంలో నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్‌, బాధితురాలి సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్లతోపాటు సాంకేతిక ఆధారాలు, 30 మందికిపైగా విచారించిన పోలీసులు వారు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా కోర్టుకు సమర్పించే రిపోర్టులో పొందుపర్చనున్నారు.

దిశ మృతదేహాన్ని మొదట చూసిన సత్యం, మొదట ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్‌ హనుమంతు, దిశ కుటుంబ సభ్యులు, పెట్రోల్‌ కొనుగోలు చేసేందుకు వచ్చిన శివ, నవీన్‌లను గుర్తించి డయల్‌-100కు ఫోన్‌ చేసి సమాచారం అందించిన బంకు క్యాషియర్‌, దిశ మృతదేహాన్ని తరలించిన లారీ యజమాని, పంక్చర్‌ దుకాణదారుడు, పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులు, ఇతరుల వాంగ్మూలాలను అధికారులు రిపోర్టులో పొందుపరుస్తున్నారు. నిందితులు మృతి చెందడంతో తదుపరి దర్యాప్తు చేసే వీలు లేనందున కేసు క్లోజ్‌ చేసేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు తెలిసింది. తదుపరి దర్యాప్తునకు ఆస్కారం లేని పలు కేసుల్ని గతంలో పోలీసులు కోర్టు అనుమతితో క్లోజ్‌ చేశారు. దీంతో ప్రస్తుత కేసులోనూ అదే తరహాలో ముందుకెళ్లనున్నట్లు సమాచారం.