Begin typing your search above and press return to search.

14 ఏళ్ళ మైనర్ బాలికపై యువకుల అత్యాచారం.. 24 గంటల్లో కేసు ఛేదన

By:  Tupaki Desk   |   19 Aug 2020 5:32 PM GMT
14 ఏళ్ళ  మైనర్ బాలికపై యువకుల అత్యాచారం.. 24 గంటల్లో కేసు ఛేదన
X
అభం శుభం తెలియని అమాయక బాలికపై ఆ యువకులు దారుణంగా అత్యాచారం చేశారు. 14 ఏళ్ల మైనర్ అని కూడా చూడకుండా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కానీ పోలీసులు సవాల్ గా తీసుకొని కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించి ఆ కామాంధులను కటకటాల పాలు చేశారు.

గుంటూరు జిల్లా తెనాలి ముత్యంశెట్టిపాలెంకు చెందిన 14 ఏళ్ల బాలికను గత నెల 26న కిడ్నాప్ చేసి రెండువారాలపాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కేసు నమోదైన 24 గంటల్లో తెనాలి పోలీసులు ఆ కేసును ఛేదించడం విశేషం. ఈ సందర్భంగా తెనాలి డీఎస్పి కె.శ్రీలక్ష్మి మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు.

పొన్నూరు సమీపంలోని కర్లపాలెం చెందిన నూతలపాటి నవీన్ కుమార్ అనే యువకుడు మైనర్ బాలిక(14)కు మాయమాటలు చెప్పి.. ఇంటూరు లాగు అనే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తెనాలి వైకుంఠపురం దగ్గర వదిలి వెళ్ళాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళితే తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో అర్థరాత్రి స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు ఆ మైనర్ బాలిక పేరేచర్ల చేరుకుంది. అదే సమయంలో హోంగార్డ్ అశోక చక్రవర్తి, అతని స్నేహితుడు నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్తే నేను తీసుకు వెళ్తానని నమ్మబలికారు. అనంతరం ఆ బాలికను హోంగార్డు వాహనంపై తీసుకెళ్లి ఒక గదిలో నిర్బంధించాడు. హోంగార్డ్ అశోక్ తోపాటు అతడి స్నేహితులు కలిసి రెండు వారాల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈనెల 13న బాలిక వారి చెర నుంచి తప్పించుకొని.. తెనాలిలోని తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది. జరిగిన సంఘటనలు తల్లిదండ్రులకు తెలుపగా.. వారు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన తెనాలి పోలీసులు ఫిర్యాదు చేసిన 24 గంటల్లో కేసును ఛేదించారు.

గుంటూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుగా పని చేస్తున్న అశోక చక్రవర్తి, అతని స్నేహితుడు దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై నిర్భయ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేసినట్లు తెనాలి డిఎస్పి కె.శ్రీలక్ష్మి తెలిపారు.