Begin typing your search above and press return to search.

యూపీలో ఘోరం: 8 మంది పోలీసులు - ముగ్గురు రౌడీషీట‌ర్లు దుర్మ‌ర‌ణం

By:  Tupaki Desk   |   3 July 2020 3:30 PM GMT
యూపీలో ఘోరం: 8 మంది పోలీసులు - ముగ్గురు రౌడీషీట‌ర్లు దుర్మ‌ర‌ణం
X
సాధార‌ణంగా పోలీసులంటే రౌడీ షీట‌ర్ల‌కు భ‌యం. కాక‌పోతే ఉత్తరప్రదేశ్‌లో ప‌రిస్థితి వింత‌గా ఉంటుంది. ఆ రాష్ట్రంలో రౌడీ షీట‌ర్ల ఆగ‌డాలు దారుణంగా ఉంటాయి. ఆ రాష్ట్రంలో భ‌ద్ర‌త క‌ల్పించే పోలీసుల‌కే భ‌ద్ర‌త లేకుండాపోయింది. రౌడీ షీట‌ర్ల చేతిలో పోలీసులు దారుణ హ‌త్య‌కు గురయిన సంఘ‌ట‌న‌లో నిందితులు పోలీసుల తూటాకు బ‌ల‌య్యారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు గాయపడిన విష‌యం తెలిసిందే. తాజాగా చేసిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు క్రిమినల్స్ చ‌నిపోయారు.

ఈ ముగ్గుర్నీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరులుగా భావిస్తున్నారు. అయితే ఈ ఎన్‌కౌంట‌ర్ నుంచి వికాస్ దూబే తప్పించుకున్నాడ‌ని స‌మాచారం. చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిథూర్ దిక్రూ గ్రామంలో జూలై 3వ తేదీన అర్ధరాత్రి పోలీసులు గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఇంటిపై దాడి చేశారు. అత‌డిపై 60 కేసులు ఉండడంతో పాటు పోలీసుల హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో మూడు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు ఆ గ్రామంలో మూకుమ్మ‌డి దాడి చేశారు. ఈ స‌మాచారం తెలుసుకున్న దూబే తన అనుచరులతో అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. ఈ సంద‌ర్భంగా పోలీసులపై దాడి చేసేందుకు ప్లాన్ వేశాడు.

అందులో భాగంగా మారణాయుధాలు, తుపాకులతో పోలీసులను చుట్టుముట్టి, రోడ్డుకు అడ్డంగా జేసీబీని ఉంచాడు. పోలీసులు వచ్చిన మార్గాన్ని మూసేసి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డీఎస్పీ దేవేందర్ మిశ్రా, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ఎదురుకాల్పులు జరిపి ముగ్గుర్ని హతమార్చాయి. మిగతావారితో కలిసి దూబే తప్పించుకుని, సమీపంలోని అడవుల్లోకి పరారయ్యాడు.

అయితే తాము గ్రామానికి వ‌స్తున్న స‌మాచారం గ్యాంగ్‌స్టర్‌కి ముందే ఎలా తెలిసింది? ఎవ‌రు స‌మాచారం ఇచ్చార‌ని పోలీస్ ఉన్న‌త అధికారులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ గ్రామంలో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి పోలీస్ బ‌ల‌గాలు మోహ‌రించాయి.