Begin typing your search above and press return to search.

సాయం చేస్తూ దడ పుట్టిస్తున్న తెలంగాణ మహిళా ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   22 May 2020 10:00 AM IST
సాయం చేస్తూ దడ పుట్టిస్తున్న తెలంగాణ మహిళా ఎమ్మెల్యే
X
కొన్ని రోజుల క్రితం మీడియా సమావేశాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు వారి ప్రాంతాలకు కథానాయకులు కావాలని కోరారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అత్యధికులు గులాబీ ప్రజాప్రతినిధులు కావటంతో.. ఆయన పిలుపునిచ్చింది గులాబీ బ్యాచ్ కే అని చెప్పక తప్పదు. సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చే ప్రతిమాటను తూచా తప్పకుండా పాటించే గులాబీ నేతలు.. లాక్ డౌన్ వేళ.. ఊరి కథానాయకులుగా మారాలన్న పిలుపు మాత్రం విననట్లు ఉండిపోయారు. అందరూ అలానే ఉన్నారని కాదు కానీ.. చాలావరకూ అలాంటి పరిస్థితే నెలకొంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఎమ్మెల్యేలకు భిన్నంగా ఎక్కడెక్కడో కొండల్లో..కోనల్లో ఉండిపోయి సాయం కోసం ఎదురుచూస్తున్న ఆదివాసీలకు సరుకులు సాయం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న సాహసాలు అన్నిఇన్నికావు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులకు భిన్నంగా.. సరుకుల మూటల్ని స్వయంగా పట్టుకొని కొండలు తిరుగుతున్న వైనం కదిలించి వేసింది. మీడియాలోనూ ఆమె చేస్తున్న పనులు హైలెట్ అవుతున్నాయి. ఇప్పుడున్న రోజుల్లోనూ ప్రజల కోసం ఇంతలా పని చేసేటోళ్లు.. సాహసం చేసే వారున్నారా? అని ఆశ్చర్యపోయే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. సాయం చేసేందుకు వెళుతున్న ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు తరచూ అడ్డుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. అసిఫాబాద్ మండలంలోని ఇప్పల్ నవేగంలో సరుకులు పంచుకునేందుకు సీతక్క బయలుదేరారు. ఆమెను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు కర్ఫ్యూ కారణంగా అనుమతి లేదంటూ సాయం చేసేందుకు వెళుతున్న ఎమ్మెల్యేను అడ్డుకోవటం వివాదంగా మారింది.

దీంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీతక్క.. తానేమన్నా పాకిస్థాన్ నుంచి వచ్చానా? అని ప్రశ్నించటంతో పాటు.. పోలీసుల తీరుపై ఫైర్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా పోలీస్ బాస్ చెప్పటమే కాదు.. చేసి చూపిస్తున్నారు. అలాంటిది ఎమ్మెల్యే సీతక్క విషయంలో మాత్రం అందుకు భిన్నంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. నిజాయితీగా సాయం చేస్తున్న విపక్ష ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవటం ద్వారా.. తెలంగాణ ప్రభుత్వ డ్యామేజ్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పక తప్పదు.