Begin typing your search above and press return to search.

ఈ సండే పోలీసుల‌కు చుక్క‌లు త‌ప్ప‌వ‌ట‌!

By:  Tupaki Desk   |   1 Sep 2018 5:36 AM GMT
ఈ సండే పోలీసుల‌కు చుక్క‌లు త‌ప్ప‌వ‌ట‌!
X
దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ రాజ‌కీయ అధినేత చేయ‌ని రీతిలో పాతిక ల‌క్ష‌ల మందితో నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్లు ఎంత భారీగా ఉన్నాయో వింటుంటే.. వామ్మో అనుకోకుండా ఉండ‌లేని ప‌రిస్థితి. అధికార ప‌క్షంగా.. చేతిలో ఉన్న అధికారాన్ని ఏ రేంజ్లో వాడుకోవ‌చ్చ‌న్న విష‌యాన్ని తాజా స‌భ స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్పాలి. ఈ స‌భ కోసం అత్యున్న‌త పోలీసు అధికారుల‌తో ఏకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేయ‌టం క‌నిపిస్తుంది.

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ కోసం బందోబ‌స్తును కో-ఆర్డినేట్ చేసేందుకు కీల‌క అధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం ఏమంటే.. ఆదివారం సాయంత్రం నిర్వ‌హించ‌నున్న స‌భ కోసం కేటాయిస్తున్న పోలీసు సిబ్బంది ఎంతో తెలుసా? అక్ష‌రాల పాతిక వేల మంది.

కానిస్టేబుల్ మొద‌లు సీపీ స్థాయి అధికారుల వ‌ర‌కూ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ కోసం ప‌ని చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఈ స‌భ కోసం పోలీసు శాఖ చేస్తున్న క‌స‌ర‌త్తు అంతా ఇంతా కాదు. స‌భ‌కు రెండు రోజుల ముందే (శుక్ర‌వారం రాత్రి) ఉన్న‌తాధికారుల‌కు స‌భ‌కు సంబంధించి కీల‌క బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తూ ఆదేశాల్ని జారీ చేశారు.

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ వ‌ద్ద బందోబ‌స్తు స‌మ‌న్వ‌యం కోసం అద‌న‌పు డీజీ (లా అండ్ ఆర్డ‌ర్‌) జితేంద‌ర్ కు.. స‌భ‌కు ఇన్ ఛార్జిగా రాచ‌కొండ సీపీ మ‌హేవ్ భాగ‌వ‌త్ కు.. సెక్యూరిటీ ఇన్ చార్జిగా సజ్జ‌నార్ ను .. ప‌బ్లిక్ కో ఆర్డినేట‌ర్లుగా జాన‌కీ ష‌ర్మిల‌.. శ‌శిధ‌ర్ రాజుల‌ను నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. వీరే కాక‌.. ప‌లువురు ఉన్న‌త స్థాయి పోలీసు అధికారుల్ని ఈ స‌భ కోసం కేటాయించారు.

ఇక‌.. ఈ స‌భ కోసం విధులు నిర్వ‌ర్తించ‌నున్న పోలీసు సిబ్బంది లెక్క‌లు తెలిస్తే క‌ళ్లు చెదిరిపోవ‌టం ఖాయం. 20 మందికి పైనే ఎస్పీలు.. ఆడిష‌న‌ల్ ఎస్పీలు.. 120 మంది డీఎస్పీ క్యాడ‌ర్ అధికారులు.. వెయ్యి మంది సీఐలు.. ఎస్ ఐలు.. 9వేల మంది సివిల్.. ఏపీఎస్సీ పోలీసుల‌తోపాటు.. 2వేల మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఒక అధికార‌పార్టీ నిర్వ‌హిస్తున్న భారీ బ‌హిరంగ స‌భ కోసం ఇంత భారీ ఎత్తున పోలీసులు విధులు నిర్వ‌ర్తించ‌టం ఇదే తొలిసారి అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఆదివారం పోలీసుల‌కు.. అధికారుల‌కు చుక్క‌లు క‌నిపించ‌ట‌మే కాదు.. భారీ ప‌రీక్ష‌గా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు.