Begin typing your search above and press return to search.

హరీశ్ ఇలాకాలో ఈ ఓవర్ యాక్షన్ ఏమిటి?

By:  Tupaki Desk   |   30 April 2021 12:09 PM IST
హరీశ్ ఇలాకాలో ఈ ఓవర్ యాక్షన్ ఏమిటి?
X
తెలంగాణ రాష్ట్రంలో మరే అసెంబ్లీ నియోజకవర్గానికి లేనంత ప్రత్యేకత.. ప్రాధాన్యత సిద్దిపేటకు ఉందని చెబుతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి.. విపక్షంలో ఉన్నప్పుడు కూడా.. నియోజకవర్గాన్ని డెవలప్ చేసేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే హరీశ్ చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావని చెబుతారు. మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు కానీ.. సిద్దిపేటలో జరిగిన డెవలప్ మెంట్.. ఆ పట్టణంలోని రియల్ ఎస్టేట్ గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

పేరుకు కార్పొరేషన్ అయినప్పటికి.. జనాభా పరంగా చూసినప్పుడు మున్సిపాలిటీకి కాస్త ఎక్కువే కానీ.. కార్పొరేషన్ స్థాయి ఏ మాత్రం కాదు. ఈ పట్టణమంతా హరీశ్ కనుసన్నల్లోనే నడుస్తుందన్న మాట వినిపిస్తుంటుంది. తెలంగాణ రాష్ఠ్ర ఏర్పాటు తర్వాత.. ఇక్కడ జరిగిన డెవలప్ మెంట్ అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ నియోజకవర్గంలో పోస్టింగ్ అంత తేలిక కాదని చెబుతారు. దానికి ప్రత్యేక విధానం ఉంటుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

తాజాగా సిద్దిపేట కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు కీలకమైన పోలింగ్ జరుగుతోంది. దీని కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు ఓవరాక్షన్ చేయటం సంచలనంగా మారింది. మిగిలిన చోట్ల సంగతి ఎలా ఉన్నా.. సిద్దిపేటలో మీడియా ప్రతినిధులకు ప్రయారిటీ ఎక్కువని చెబుతారు. ఎందుకంటే.. ఇక్కడి వారంతా మంత్రి హరీశ్ కు అత్యంత సన్నిహితులు కావటమే. ఎంతో సీనియర్లు అయిన వీరి విషయంలో హరీశ్ ప్రత్యేక ప్రయారిటీ ఇస్తుంటారు. ఈ కారణంతోనే పోలీసులు సైతం ఆచితూచి అన్నట్లు వ్యవమరిస్తారు.

ఇందుకు భిన్నంగా.. తాజాగా పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు సంచలనంగా మారింది. కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ పరిశీలనకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దుబ్బాక సీఐ హరిక్రిష్ణ దుర్బాషలాడినట్లుగా చెబుతున్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు సీరియస్ కావటమే కాదు.. ఎన్నికల కేంద్రం ముందు నిరసన చేపట్టారు. తమకు జరిగిన అవమానంపై మంత్రి హరీశ్ ముందుకు తీసుకెళతామని.. చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టమని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.