Begin typing your search above and press return to search.

సీఐ మీసం తిప్పి మరీ జేసీ కి వార్నింగ్

By:  Tupaki Desk   |   21 Sep 2018 4:22 AM GMT
సీఐ మీసం తిప్పి మరీ జేసీ కి వార్నింగ్
X
కోపం వ‌స్తే వెనుకా ముందు చూసుకోకుండా తిట్టేయ‌టం కొంద‌రు ప్రజాప్ర‌తినిధుల జ‌న్మ‌హ‌క్కుగా భావిస్తుంటారు. ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించి.. కీల‌క‌మైన పోలీస్ వ్య‌వ‌స్థ‌ను తీవ్ర‌స్థాయిలో కించ‌ప‌రిచేలా మాట్లాడిన టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి తీరుపై పోలీసు అధికారుల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

జేసీ వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా ఖండిస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌ట‌మే కాదు.. పోలీసు వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడితే నాలుక తెగ్గోస్తాం జాగ్ర‌త్త అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన అనంత‌పురం జిల్లాలోని ప్ర‌భోదానంద ఆశ్ర‌మ వివాదంలో పోలీసుల తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ ఎంపీ జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సిగ్గులేని పోలీసులు.. నిర్వీర్య‌మైన వ్య‌వ‌స్థ ఉన్న‌ట్టా.. చ‌చ్చిపోయిన‌ట్టా? అంటూ మండిప‌డ‌టంతో పాటు.. మీరు ఇంతే అంటూ పోలీసుల ముందు హిజ్రాల‌తో డ్యాన్స్ లు వేయించిన వైనంపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ఈ ఉదంతంపై ఏపీ పోలీసు అధికారుల సంక్షేమ సంఘంతో పాటు.. అనంత‌పురం జిల్లా పోలీసు సంఘం అధికారులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

జేసీ వ్యాఖ్య‌ల్ని ఖండిస్తూ పోలీసు అధికారుల సంఘం నేత‌లు మీడియాతో మాట్లాడారు. తాము సైతం సీమ బిడ్డ‌ల‌మ‌ని.. ఇటీవ‌ల కాలంలో పార్టీల‌కు అతీతంగా కొంద‌రు ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. పోలీసు వ్య‌వ‌స్థ స్థైర్యం దెబ్బ తీసేలా మాట్లాడుతున్నార‌ని.. ఇలాంటి వారి తీరుకు తాము సంయ‌మ‌నం ప్ర‌ద‌ర్శించామ‌ని.. ఇక‌పై అలాంటి వాటి విష‌యంలో స‌హించేది లేద‌న్నారు. అదుపు త‌ప్పి మాట్లాడితే నాలుక తెగ్గోస్తాం.. త‌స్మాత్ జాగ్ర‌త్త అంటూ సీరియ‌స్ అయ్యారు.

హిజ్రాల‌తో పోలుస్తూ డ్యాన్సులు వేయించిన తీరుపై స్పందిస్తూ.. న‌క్స‌లిజాన్ని.. ఫ్యాక్ష‌నిజాన్ని.. రౌడీయిజాన్ని ఒంటి చేత్తో అణిచివేసిన త‌మ సామ‌ర్థ్యాన్ని మ‌ర్చిపోవ‌ద్ద‌ని.. ఇన్నాళ్లు ఊరుకున్నాం కానీ ఇక‌పై ఊరుకునేది లేద‌ని మండిప‌డ్డారు. తాము రాయ‌ల‌సీమ బిడ్డ‌ల‌మ‌ని.. త‌మ‌కు పౌరుషం ఉంద‌ని.. మ‌గాళ్లం కాబ‌ట్టే పోలీసు వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చిన‌ట్లుగా ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన పోలీసు అధికారుల సంఘం అనంత‌పురం జిల్లా అధ్య‌క్షుడు సాకే త్రిలోక్ నాథ్ వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

వ్య‌వ‌స్థ‌లో అక్క‌డ‌క్క‌డా జ‌రిగే త‌ప్పిదాల‌కు మొత్తం వ్య‌వ‌స్థ‌నే కించ‌ప‌రిచేలా మాట్లాడితే ఊరుకునేది లేద‌ని వ్యాఖ్యానించారు. ఎంత రాజ‌కీయ‌మైతే మాత్రం.. ఈ ఎపిసోడ్‌లోకి పోలీసు అధికారుల్ని తీసుకురావ‌టం జేసీ త‌ప్పిదంగా చెప్పాలి. పోలీసుల‌తో సున్నం పెట్టుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న విష‌యాన్ని జేసీ గుర్తించ‌టం అవ‌స‌ర‌మ‌న్న మాట‌ను అధికార ప‌క్ష నేత‌లు లోగుట్టుగా సూచ‌న‌లు చేస్తున్నారు. ప్ర‌భోదానంద విష‌యంలో ఉడికిపోతున్న జేసీ.. ఈ మాట‌ల్ని విచ‌క్ష‌ణ‌తో వినే అవ‌కాశం ఉందంటారా?