Begin typing your search above and press return to search.

ఖాకీల కర్కశం.. నల్లజాతీయుడి హత్యతో అమెరికా భగ్గు

By:  Tupaki Desk   |   4 Sept 2020 9:30 AM IST
ఖాకీల కర్కశం.. నల్లజాతీయుడి హత్యతో అమెరికా భగ్గు
X
అమెరికాలో నల్లజాతీయుల పై దాడులు కొనసాగుతున్నాయి. జార్జ్ ప్లాయిడ్ హత్య, జాకబ్ బ్లేక్ హత్యాయత్నంపై ఇంకా నిరసనలు కొనసాగుతున్న సమయంలో మరో సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జార్జ్ ప్లాయిడ్ హత్య కంటే ముందే జరిగిన ఘటన ఇది. న్యూయార్క్ రాష్ట్రంలోని రోచెస్టర్ లో కొందరు వ్యక్తులు నల్లజాతీయుడి తలకు హుడ్ కప్పి ఊపిరి ఆడకుండా దారుణంగా హింస పెట్టారు. అతడు అపస్మారక స్థితిలోకి చేరడంతో ఆస్పత్రికి తరలించారు. అతడు అక్కడ చికిత్స పొందుతూ మార్చి 30వ తేదీన చనిపోయాడు.

తాజాగా ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమెరికాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల వేళ ఈ ఘటన రిపబ్లికన్ పార్టీకి కాస్త దెబ్బేనని అంటున్నారు. రోచెస్టర్ మేయర్ ఈ ఘటనకు కారణమైన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. చికాగోకు చెందిన ఓ కుటుంబం గత మార్చిలో రోచెస్టర్ కు వచ్చింది. ఆ సమయంలో మానసిక స్థితి సరిగా లేని డేనియల్ ప్రుడే తప్పిపోయాడు. కుటుంబీకులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మార్చి 23 న తెల్లవారుజామున ఒంటిపై బట్టలు లేకుండా రోడ్డు పై నగ్నంగా పెరుగుతున్న డేనియల్ ప్రుడేను పోలీసులు చూశారు. అతడి చేతులను వెనక్కి విరిచి కట్టేసి తలను హుడ్ తో కప్పి రోడ్డుకు అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేశారు. కాసేపటికి డేనియల్ అపస్మారక స్థితికి చేరడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మార్చి 30వ తేదీన చనిపోయాడు. ఓ హ్యూమన్ రైట్స్ వాచర్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇవి వైరల్ గా మారాయి.

ఈ ఘటనపై డేనియల్ సోదరుడు రోచెస్టర్ మేయర్ కు ఫిర్యాదు చేయడంతో డేనియల్ మరణానికి కారణమైన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. డేనియల్ మృతితో రోచెస్టర్లో నల్ల జాతీయులు రెచ్చిపోయారు. రోడ్లపైకి చేరుకుని పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. సిటీ పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ ఈ ఘటనతో పరిస్థితులు ఏ విధంగా మారతాయో తెలీక అంతా ఆందోళన చెందుతున్నారు.