Begin typing your search above and press return to search.

నేర‌స్థుల చిట్టా విప్పుతున్న చింటూ

By:  Tupaki Desk   |   3 Dec 2015 11:47 AM GMT
నేర‌స్థుల చిట్టా విప్పుతున్న చింటూ
X
రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ చిత్తూరు మేయ‌ర్ కఠారి అనురాధ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ త్వ‌ర‌లో వీడిపోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కేసులో ప్రధాన నిందితుడు చింటూ పోలీసుల‌కు లొంగిపోవ‌డంతో ఇక హ‌త్య వెనుక ఎవ‌రున్నార‌నే విష‌యంపై పోలీసులు దృష్టిసారించారు. హ‌త్య‌లు ఎందుకు చేశారు? ఈ కుట్ర‌లో ఎవ‌రెవ‌రు ఉన్నారు? దీని గురించి ఎవ‌రెవ‌రికి తెలుసు? అనే కోణంలో చింటూని విచారిస్తున్నారు. ఈ విష‌యాల‌ను రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ముందుగా అనుకున్న ప్ర‌కారం కాకుండా నిందితుల సంఖ్య పెర‌గ‌వ‌చ్చ‌ని స‌మాచారం.

పోలీసుల కస్టడీలో ఉన్న చింటూ మేయర్ హత్య ఘటనపై పలు విషయాలు పూసగుచ్చినట్లు చెప్పినట్టు సమాచారం. ఆ వివరాల ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఎనిమిది మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. వారికి హత్య కుట్రలో ఏ మేరకు సంబంధాలున్నాయనే విషయం నిర్ధారించుకున్న తర్వాత కేసులు నమోదు చేయడానికి పోలీసులు సమాయత్తమవుతున్నారు.

న‌వంబ‌రు 17న చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మేయర్ దంపతుల జంట హత్య కేసులో పోలీసులు ప్రాథమికంగా 11 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే.. చింటూ చెబుతున్న విషయాల ఆధారంగా నిందితుల సంఖ్య పెరగనుందని కేసును విచారిస్తున్న పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అందరినీ అరెస్టు చేయబోమని, హత్య కుట్రలో పాలు పంచుకున్నవారు, కుట్ర విషయం ముందుగానే తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వని వారు ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని సాక్ష్యాలు సేకరిస్తామని, అనంతరం వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు చింటూను 15 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు బుధవారం ఇతన్ని చిత్తూరు నగరంలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు. కస్టడీ గడువు పూర్తయ్యేంత వరకు చింటూను తమ వద్దే ఉంచుకుని తరువాత కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.