Begin typing your search above and press return to search.

రుణ యాప్ దందాలో తప్పు చేస్తున్న కొడుకును అరెస్టు చేసిన పోలీసు ఫాదర్

By:  Tupaki Desk   |   1 Jan 2021 10:00 PM IST
రుణ యాప్ దందాలో తప్పు చేస్తున్న కొడుకును అరెస్టు చేసిన పోలీసు ఫాదర్
X
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన రుణయాప్ ఎపిసోడ్ లో సంచలన ఉదంతం చోటు చేసుకుంది. కేవలం ఆర్నెల్ల వ్యవధిలో రూ.21వేల కోట్ల టర్నోవర్ చేసిన చైనా కంపెనీ ఉదంతం షాకింగ్ గా మారింది. ఈ కంపెనీకి సంబంధించి కీలకమైన వారిని హైదరాబాద్ పోలీసులు ఢిల్లీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. చైనా జాతీయుడితో పాటు.. కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజును కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ అరెస్టుల వెనుక కొత్త కోణం ఒకటి తాజాగా బయటకు వచ్చింది.

నాగరాజు అరెస్టు వెనుక.. అతడి తండ్రి.. పోలీసు అధికారి కీలకంగా వ్యవహరించారు. కొడుకు చేసిన తప్పుల్ని గుర్తించిన పోలీసు తండ్రి.. పేగు బంధం కంటే.. పోలీసు బాధ్యతకే ప్రాధాన్యత ఇచ్చారు. కొడుకును తనకు తానుగా పిలిచి.. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్టు చేయించిన వైనం విస్తుపోయేలా చేస్తోంది. లక్షలాది మందిని తన కొడుకు మోసం చేస్తున్నాడన్న విషయం కొద్ది రోజుల క్రితం నాగరాజు తండ్రికి తెలిసింది. అతడు చేస్తున్న తప్పుల గురించి ఏ మాత్రం ప్రస్తావించని నాగరాజు తండ్రి.. అతన్ని కర్నూలుకు రావాలని కోరాడు.

తండ్రి మాటతో మూడు రోజుల క్రితం నాగరాజు ఢిల్లీ నుంచి వచ్చాడు. ఆ వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన నాగరాజు తండ్రి.. తన కొడుకును అరెస్టు చేయించారు. బంధం కంటే పోలీసు బాధ్యతే ముఖ్యమన్న విషయాన్ని తన చేతలతో నిరూపించారు. కర్నూలు జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పని చేస్తున్న ఆయన పేరు.. వివరాలు బయటపెట్టొద్దని సైబర్ క్రైమ్ పోలీసు అధికారుల్ని ఆయన కోరినట్లుగా తెలుస్తోంది.

కాగా.. ఈ పోలీసు అధికారికి ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరు నాగరాజు అయితే మరొకరు ఈశ్వర్ కుమార్. వీరిద్దరూ తొలుత బెంగళూరులో ఉద్యోగాలు చేసే వారు. అన్నదమ్ముల్లో నాగరాజు రుణ యాప్ సంస్థలో చేరాడు. ఆ తర్వాత తమ్ముడ్ని కూడా ఇందులో చేర్పించాడు. ఎప్పుడైతే తన అన్న నాగరాజు అరెస్టు అయ్యాడో.. తమ్ముడు కూడా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయారు. మొత్తంగా.. కొడుకు చేస్తున్న తప్పుల్ని కవర్ చేయకుండా.. అసలుసిసలు పోలీసుగా వ్యవహరించిన ఆయనకు చేతులు జోడించి నమస్కరించాల్సిందే.